శ్రీశైలం లో దర్శనం, సేవల్లో కీలక మార్పులు..!!
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో కీలక మార్పులకు నిర్ణయం జరిగింది. శక్తి పీఠమైన శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో దర్శన విధానంలో మార్పులకు నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడకు భక్తులు తరలి వస్తారు. దీంతో, సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ కొత్త నిర్ణయాల ను అమలు చేయనున్నారు. స్వామి వారి సేవల విషయంలోనూ మార్పులు చేస్తున్నారు.
శ్రీశైలంలో దర్శన విధానంలో మార్పులు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసారు. ఆలయానికి సెలవు రోజులు..వారాంతం తో పాటుగా వైదిక కమిటీ సూచిన ప్రత్యేక పర్వదినాల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో, వైదిక కమిటీ సూచనల మేరకు నిర్దేశించిన రోజుల్లో .. మహోత్సవాల సమయంలో గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, శ్రీచక్ర కుంకుమార్చనలతోపాటు ఉదయాస్తమాన సేవ, ప్రాతః కాలసేవ, ప్రదోషకాల సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.

అదే సమయంలో మల్లికార్జున స్వామికి జరిపించే అభిషేకాలు, బిల్వార్చనలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. వారాంతపు రోజుల్లో స్వామి - అమ్మవార్ల దర్శనం కోసం దాదాపు 40 వేల మంది భక్తులు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక, మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు క్షేత్రానికి తరలివస్తున్నారు. ఇలా రద్దీ రోజుల్లో భక్తులందరి దర్శనార్థం దేవస్థానం వైదిక కమిటీ తాజా నిర్ణయాలు తీసుకుంది. ఈ కొత్త నిర్ణయాలకు భక్తులు సైతం సహకరించాలని ఈవో కోరుతున్నారు.












Click it and Unblock the Notifications