సిఎం రేసులో బొత్స, చిరు: పలువురు టీ నేతలు

రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్ర నాయకులు లాబీయింగ్ చేసుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు రాష్ట్ర నాయకులు అధిష్టానం పెద్దలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.ఈ రేసులో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. తన గ్రూప్‌తో కలిసి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు. ఆయన ఒంటరిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలని నాయకులు కోరుతున్నారు. ఈ విషయంలో మాత్రం అందరకీ ఏకాభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది.
బొత్స సత్యనారాయణ, చిరంజీవిలతో పాటు కన్నా లక్ష్మినారాయణ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి ఇస్తే ఆ తర్వాత సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవికి పోటీకి రాబోనని ఆయన హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, తెలంగాణ నుంచి మాత్రం పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు జె. గీతారెడ్డి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కె. జానా రెడ్డి, డి. శ్రీనివాస్, సర్వే సత్యనారాయణ వంటి పలువురు నాయకులు పోటీలో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications