తుఫాన్ బలహీన పడింది గానీ..: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో మురసు తుఫాన్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. సుమారు రూ. 343.95 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో దాదాపు 94 శాతం నష్టం వ్యవసాయంలోనే సంభవించింది. ఏడు జిల్లాల్లో 465 గ్రామాల పరిధిలో 50,473 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నది. 69,828 మంది రైతులు ప్రభావితం అయ్యారు. వీటిలో 45,900 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. ఒక్క వ్యవసాయ శాఖలోనే రూ. 324.22 కోట్ల నష్టం సంభవించింది. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా నమోదైంది. ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తుఫాను తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇది బలహీనపడింది. అయినప్పటికీ.. మంగళవారం సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలకు కారణమైంది. కోస్తా తీర ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది.

నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి.. కృష్ణా, గుంటూరు , బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం.. జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, రాయచోటి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని ప్రఖర్ జైన్ వివరించారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగులు, శిథిల భవనాలు, చెట్ల కింద నిల్చోకూడదని సూచించారు.
మొదట ఆర్ణబ్, ఆ తర్వాత మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయని, వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.














Click it and Unblock the Notifications
