బాలికపై లైంగిక దాడి: పట్టపగలు చోరీ
విజయవాడ: ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం కొమ్మనేనివారిపాలెంలో ఓ బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కొమ్మనేనివారి పాలెంలో సంచలనం సృష్టించింది. బాలిక తల్లిదండ్రులు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, లైంగిక దాడికి పాల్పడిన బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అదలావుంటే, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే శుక్రవారం ఉదయం భారీ చోరీ జరిగింది. ఆత్మకూరు పట్టణంలోని ఉమామహేశ్వరరావు అనే నగల వ్యాపారి నగల బ్యాగు తీసుకొని దుకాణానికి వచ్చి, దాన్ని పక్కన పెట్టి షట్టర్ తాళాలు తీస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి నగల బ్యాగును ఎత్తుకెళ్లారు.
బ్యాగులో రూ.50 లక్షల రూపాయల విలువగల బంగారం, వెండి నగలున్నాయని ఉమామహేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.

మహిళ అనుమానాస్పద మృతి
శుక్రవారం ఉదయం నెల్లూరు, కడప జిల్లాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు మరణించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీసు బెటాలియన్ క్వార్టర్స్‌లో ఓ కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తే తమ కూతురిని చంపాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.
భర్త మరణించాడనే మనస్థాపంతో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మెయిన్‌బజార్‌లో చంద్రకళ అనే ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మంది మరణించారు. విశాఖ జిల్లా నాకవరపాలెం మండలం దీనబోయినపాలెంలో వ్యాన్ బైక్‌ను ఢీకొనడం వల్ల దంపతులు మరణించారు.
విశాఖ జిల్లాలోనే తాటిచెట్లపాలెం జంక్షన్ దగ్గర జరిగిన మరో ప్రమాదంలో ట్రాలీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హిజ్రాతో సహా యువకుడు మరణించారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట చెక్‌పోస్టు దగ్గర వ్యాన్ ఢీకొనడం వల్ల రెండు జింకలు మరణించాయి.












Click it and Unblock the Notifications