అఖిలప్రియా! సిద్ధంగా ఉండు: శిల్పా సవాల్, వైసీపీలోకి భూమా సన్నిహితుడు
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి భూమా అఖిలప్రియ, ఇటీవలే టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు.

అఖిలప్రియకు సవాల్
అంతేగాక, అఖిలప్రియ తన సవాల్‌కు కట్టుబడి మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని శిల్పా మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్య, మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సన్నిహితుడు గోపవరం గోపీనాథరెడ్డి బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Recommended Video


నా వెంటనే ఉన్నారు..
ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడుగురు కౌన్సిలర్లు తమ వర్గంలోకి వచ్చారని, మొత్తం 42మందిలో 26మంది తమ వైపు ఉన్నారని చెప్పారు. చైర్ పర్సన్ దేశం సులోచనను పదవి నుంచి దించుతామని ప్రచారం చేస్తున్నారని, దీన్ని సవాల్‌గా స్వీకరించానని చెప్పారు. తన వర్గానికి చెందిన వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని, కానీ వారంతా తమకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ నేతలు తేదీ ఎప్పుడు చెప్పినా బల ప్రదర్శనక చేయడానికి సిద్ధంగా ఉన్నారని శిల్పామోహన్ రెడ్డి తేల్చి చెప్పారు.

బ్రహ్మానందరెడ్డి వారసుడా?
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న బ్రహ్మానందరెడ్డి.. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వారసుడు కాదని శిల్పా అన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు మాత్రమే వారసులని అన్నారు. నంద్యాలలో జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబునాయుడు, బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించారన్నారు.

అందుకే జగన్..
బ్రహ్మానందరెడ్డి.. భూమా వారసుడు కాకపోవడంతోనే తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గంట ముందు కూడా పలువురు మంత్రులు ప్రలోభపెట్టడానికి ప్రయత్నాలు చేశారని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. కానీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్నారు. టీడీపీ నాన్చుడు దోరణి, అఖిలప్రియ వ్యవహారశైలి వల్లే తాను టీడీపీని వీడినట్లు చెప్పారు.

శిల్పాతోనే అరాచకాలకు అడ్డుకట్ట..
గోపీనాథరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పతనం నంద్యాల నుంచే ప్రారంభమవుతోందని అన్నారు. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకట్ట వేసి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలంటే శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. కాగా, మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్యతోపాటు ఆయన వర్గానికి చెందిన గఫూర్, రాజశేఖర్ గౌడ్, శ్రీనివాసులు గౌడ్, 150మంది కార్యకర్తలు శిల్పా సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications