శివసేన ఎంపీల దౌర్జన్యం: అశోక్ గజపతిరాజుపై దాడికి యత్నం, రక్షణగా టీడీపీ ఎంపీలు
కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజుపై పార్లమెంటులో శివసేన ఎంపీలు దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన సభలో కలకలం రేపింది. ఆయన పైకి ఎంపీలు మూకుమ్మడిగా దూసుకు వచ్చారు.
న్యూఢిల్లీ: పార్లమెంటులో గురువారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సాక్షిగా శివసేన ఎంపీలు రెచ్చిపోయారు. కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజుపై పార్లమెంటులో శివసేన ఎంపీలు దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన సభలో కలకలం రేపింది.
అశోక్ గజపతిరాజుపైకి ఎంపీలు మూకుమ్మడిగా దూసుకు వచ్చారు. ఆ సమయంలో తెలుగుదేశం సభ్యులు అశోక్ గజపతిరాజుకు రక్షణగా నిలబడ్డారు. పార్లమెంటు వాయిదాపడ్డ వెంటనే శివసేన ఎంపీలు కేంద్రమంత్రిపై దాడికి యత్నించారు.

దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీ, కేంద్రమంత్రి అనంత్ గీతెనే కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, అహ్లువాలియా పక్కకు తీసుకెళ్లారు. వివాదం ముదరకుండా అశోక్ గజపతిరాజు వద్దకు రాజ్‌నాథ్, సుష్మా స్వరాజ్ వచ్చారు.
ఎయిర్ ఇండియా వివాదంలో జోక్యం చేసుకోబోమని, రవీంద్ర గైక్వాడ్‌పై విచారణ జరుగుతుందని అశోక్ గజపతి రాజు స్పష్టం చేసిన నేపథ్యంలో శివసేన ఎంపీలు ఇలా వీరంగం సృష్టించారు. ముంబై నుంచి విమానాలు ఎగరనీయమంటూ హెచ్చరికలు చేశారు. విమానంలో జరిగిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వివాదంపై శివసేన ఎంపీలు ఇలా రెచ్చిపోయారు. గైక్వాడ్ వాదనను సమర్థించలేదని కోపంతో వారు పార్లమెంటు సాక్షిగానే దౌర్జన్యానికి పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications