వైసీపీ "లెక్క" తప్పుతోంది - టీడీపీలో గెలుపు జోష్: ఫలితాలు తేల్చిందేంటి..!?
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో లెక్కలు మారుతున్నాయి. వైసీపీలో అంతర్మధనం మొదలైంది.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో లెక్కలు మారుతున్నాయి. ధీమాగా కనిపించిన అధికార వైసీపీ పట్టభద్రుల మద్దతు కూడగట్టంలో వెనుకబడింది. ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికల్లో గెలుపు కొత్త జోష్ ను ఇచ్చింది. వైసీపీకి తిరుగులేదని భావిస్తున్న ఉత్తరాంధ్ర..తూర్పు రాయలసీమ పట్టభద్రులు టీడీపీకి అండగా నిలిచారు.
పశ్చిమ రాయలసీమలో వైసీపీ- టీడీపీ మధ్య హోరా హోరీ సాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్న వేళ ఈ ఫలితాలు కొత్త అంచనాలకు కారణమవుతున్నాయి. ఫలితాలతో వైసీపీలో అంతర్మధనం..టీడీపీలో కొత్త ఉత్సహం మొదలయ్యాయి.

ఎమ్మెల్సీ ఫలితాల్లో వైసీసీకి ఊహించని విధంగా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ ముందు నుంచి వ్యూహాలు సిద్దం చేసింది. టీడీపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థలు..ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీకి మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి.
విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్రలో ఎదురు లేదని భావిస్తున్న వేళ ఇప్పుడు వచ్చిన ఫలితం మింగుడు పడటం లేదు. విశాఖ రాజధాని నిర్ణయంతో కొంత కాలంగా టీడీపీ ఆత్మరక్షణలో పడింది. కానీ, ఇప్పుడు అక్కడ పట్టభద్రుల మద్దతు..ప్రధానంగా వైసీపీ కంటే 14.39 శాతం ఎక్కువగా టీడీపీకి ఓట్లు పోలవ్వటం ఆ పార్టీకి పండుగలా మారింది.
ముందుగా ప్రకటించిన అభ్యర్ధిని చివరి నిమిషంలో మార్చిన టీడీపీ.. ఉత్తరాంధ్రలో ఎన్నికల వేళ పార్టీ నేతలు కష్టపడినట్లుగానూ కనిపించలేదు. కానీ, ఫలితం మాత్రం పార్టీకి అనుకూలంగా వచ్చింది.

రాయలసీమలో ఏంటీ కొత్త లెక్క
వైసీపీకి తొలి నుంచి రాయలసీమ కంచుకోటగా ఉంది. ఇక్కడ కూడా పట్టభద్రుల నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధఇంచింది. పశ్చిమ నియోజకవర్గంంలో టీడీపీ-వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే బయట పడతారు. రాయలసీమలో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయిందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఇప్పటి వరకు కనిపించింది.
ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రం రాయలసీమలోనూ టీడీపీ అనూహ్యంగా పంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. తూర్పు రాయలసీమలో వైసీపీ కంటే టీడీపీకి ఏకంగా 10.78 శాతం ఆధిక్యత సాధించింది.
పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డిని బరిలో దించింది. సీమ ప్రాంతంలో ఒక సీటు గెలవటం.. రెండో సీటులో ఈ స్థాయిలో పోటీ ఇవ్వటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఎన్నికల వేళ ఈ ఫలితాలతో కొత్త లెక్కలు
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఈ ఫలితాలు కొత్త లెక్కలకు కారణమవుతున్నాయి. అధికార వైసీపీ అప్రమత్తం కావాల్సిన సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. టీడీపీకి నైతికంగా ఈ ఫలితాలు బలాన్ని పెంచుతున్నాయి. తమ పథకాలతో టీడీపీ అడ్రస్ ఉండదనేది వైసీపీ నాయకత్వం ధీమా. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తమకు ఎదురు ఉండదని ఇప్పటికీ వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు.
కానీ, పట్టభద్రుల తీర్పు ఎందుకు అనుకూలంగా లేదనే విశ్లేషణ అవసరమని అంగీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని తాడేపల్లి చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన సమీక్షించే అవకాశం ఉంది. వైసీపీకి ఈ ఫలితాలతో ఎటువంటి కొత్త వ్యూహాలను రానున్న రోజుల్లో అమలు చేస్తుందనేది వేచి చూడాలి. ఇక..ఏపీలో టీడీపీ వర్సస్ వైసీపీ రాజకీయం మరింత హోరా హోరీగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications