అసెంబ్లీలో ఆ బిల్లుతో ఏపీ ప్రజలకు షాక్; మరో పన్ను బాడుదుకు రెడీ అయిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలపై మరో పన్ను బాదుడుకు జగన్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 1963 మోటార్ వాహనాల పన్ను చట్టం సవరణలకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఇక ఈ బిల్లు ద్వారా వాహనాల లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పెంపుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా పన్నుల బాదుడు ఉందని ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్న సమయంలో, జగన్ సర్కార్ అసెంబ్లీలో సవరణలను ప్రవేశపెట్టిన తాజా మోటారు వాహనాల పన్ను చట్టం బిల్లు ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది.

మోటార్ వాహనాల లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పెంపుకు జగన్ సర్కార్ రెడీ
ఏపీ సర్కార్ ట్యాక్స్ ల పెంపు ద్వారా ఏపీకి ఆదాయ మార్గాలను పెంచాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఇకపై 13 శాతం 14 శాతం 17 శాతం 18 శాతం చొప్పున లైఫ్ ట్యాక్స్ విధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ట్యాక్స్ ల పెంపుతో లక్షల మందిపై వందల కోట్ల భారం మోపడానికి జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. తాజా ట్యాక్స్ ల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోపనుందని సమాచారం. 2019- 2021 సంవత్సరాలలో రవాణా శాఖకు 3181 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.

పన్నుల పెంపు ద్వారా ఆదాయం ..రెండు శ్లాబ్ లలో పన్నుల పెంపు
రాష్ట్రంలో ఇప్పటికే కోటి 31 లక్షల రవాణా వాహనాలు,1.15 కోట్ల రవాణాయేతర వాహనాలు ఉన్నాయి. ఈ క్రమంలో పన్నుల పెంపు ద్వారా అదనంగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. టూ వీలర్, ఫోర్ వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ రెండు రకాల శ్లాబుల్లో గతంలో ఉన్న ట్యాక్స్ కంటే 1 నుంచి 3 శాతం మేర పెంపు ఉండేలా నిర్ణయం తీసుకుంది. 50000 ధర కలిగిన టూవీలర్స్ కు ఒక శ్లాబ్, ఆపై ధర ఉన్న వాహనాలకు ఇంకొక శ్లాబ్ లో పన్ను పెంపు చేయనున్నారు. టూ వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా 174 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.

లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ ల ద్వారా 410 కోట్ల ఆదాయం
ఇక 8 లక్షల లోపు ధర కలిగిన ఫోర్ వీలర్స్, ఆపైన ధర కలిగిన ఫోర్ వీలర్స్ పైన రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్స్ చెల్లింపులు చేసేలా నిర్ణయించారు. ఫోర్ వీలర్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా 140 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. వివిధ వాహనాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ రేట్ల పెంపు ద్వారా అదనంగా 30 కోట్లు వస్తుందని అంచనా. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్ మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది.

జగన్ సర్కార్ పన్నుల బాదుడుకు సామాన్యులకు షాక్
2010లో చివరిసారిగా రాష్ట్రంలో విధించే పన్నుల్లో సవరణ చేయగా మళ్లీ తాజాగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, రహదారుల భద్రత, కాలుష్య నియంత్రణ కోసం పన్నులను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం కోసం ప్రభుత్వం విధిస్తున్న పన్నుల బాదుడు సామాన్యులకు వరుస షాకులు ఇస్తుంది. ప్రభుత్వ తీరుపై, పన్నులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications