బాబు ప్లాన్: ఎపి రాజధాని నిర్మాణానికి సింగపూర్ హెల్ప్
హైదరాబాద్: సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి టెక్నికల్ సహకారం అందించే అవకాశాలున్నాయంటున్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ రాయ్, మరికొందరు అధికారులను కలిశారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆహ్వానం మేరకు వారు వచ్చారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌లో ఉన్న అత్యుత్తమ కన్సల్టెన్సీ ఏమిటని చంద్రబాబు వారిని అడిగినట్లుగా సమాచారం. రాష్ట్ర అవసరం ఏమిటని సింగపూర్ అధికారులు చంద్రబాబును అడిగారట.
శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు తమ రాష్ట్రం విస్తరించి ఉందని, అందరికీ అందుబాటులో ఉండేలా ఒక రాజధాని నిర్మాణం చేయడం తమ లక్ష్యమని చంద్రబాబు వారికి చెప్పారు. మరోసారి వీరు సమావేశం కానున్నారు.

సింగపూర్‌ను తలదన్నేలా
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసినా అత్యుత్తమమైనదిగా నిర్మిస్తామని, ఇందుకోసం సింగపూర్, మలేషియా తరహాలో నగరాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నామని మంత్రి పి నారాయణ చెప్పారు. ఇందుకోసం ఆయా దేశాల రాయబారులతో చర్చించి అత్యాధునిక నగరాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, విజయవాడ పట్టణాలను మెగా సిటీలుగా, మిగిలిన మరో 10 నగరాలను స్మార్టు సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో సింగపూర్ రాయబారి అధికారులతో చర్చించామని, వారి సాంకేతిక ప్రగతిని, అనుభవాలను అర్ధం చేసుకుని రాష్ట్రంలోని నగరాలను అభివృద్ధి చేస్తామని నారాయణ చెప్పారు. రాష్ట్రంలో ఏ నగరంలో రాజధానిని ఏర్పాటు చేసినా, మిగిలిన అన్ని నగరాలు అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి నగరంలో అందరికీ ఉపాధి లభించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగానికి చెందిన సంస్థలను ఏర్పాటు చేసేలా సిఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications