రజనీకాంత్, కమల్ హాసన్ వల్ల చిన్మయికి అన్యాయం?
భారతదేశం గర్విచదగ్గ నటులైన రజనీకాంత్, కమల్ హాసన్ ఒక అమ్మాయికి న్యాయం చేయలేకపోయారా? అనే చర్చ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నడుస్తోంది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ మహిళా రెజ్లర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి వీరు పోరుబాటలో ఉన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మాత్రం తమ భారతీయ జనతాపార్టీ నాయకుడి గురించి నోరే తెరవలేదు.
దీనిపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. రెజర్లు చేస్తున్న నిరసనకు నెలరోజుల సమయం దాటిందని, మైదానంలో దేశ పతాకం కోసం పోరాడాలి.. కానీ వారిని కాపాడుకునేందుకే పోరాటం చేస్తున్నారని, వారికే తన మద్దతు అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై గాయని చిన్మయి మండిపడింది. తన ఆవేదనను ఒక ట్వీట్ రూపంలో తెలియజేసింది. తాజాగా అది వైరల్ అవుతోంది.

5 సంవత్సరాల నుంచి ఓ తమిళ గాయని నిషేధానికి గురవుతూనే ఉందని, అది కూడా ఓ మగాడి వేధింపులను తెలియజేసినందుకేనని అందరికీ తెలుసన్నారు. వారి కళ్లముందు, వారికి తెలిసిన ఇండస్ట్రీలోనే ఇలా జరుగుతున్నా కనీసం నోరు మెదపలేదని, ఇలాంటి రాజకీయ నాయకులు మహిళలకు ఏవిధంగా అండగా నిలుస్తారని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పిస్తామంటే ఎలా నమ్ముతామన్నారు. తన ట్వీట్ పై ట్రోలింగ్ జరుగుతుండగా దానిపై కూడా చిన్మయి స్పందించింది.
పాటల రచయిత వైరముత్తు తనను వేధించడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించాడని సింగర్ చిన్మయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిన్మయి మీద తమిళ చిత్ర పరిశ్రమ నిషేధం విధించింది. డబ్బింగ్ యూనియన్ కూడా ఆమెను దూరం పెట్టింది. వైరముత్తుమీద వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే అగ్ర నటులైన రజనీకాంత్, కమల్ హాసన్ ఈ విషయంలో ఎప్పుడూ చిన్మయికి మద్దతు తెలియజేయలేదు. దీంతో వీరిద్దరూ విమర్శలకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications