జగన్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం: హోంమంత్రి తానేటి వనిత
అమరావతి: నా ఎస్సీ నా ఎస్టీ,నా మైనార్టీ నా బీసీ అని సీఎం జగన్ ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించడమే కాకుండా మనసా,వాచా, కర్మణా, పాటించడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజంలో పెను మార్పులు వచ్చాయని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితా అన్నారు. అధికారం పదవులకు ఆమడ దూరంలో ఉండే ఎస్సీ ఎస్టీ, బీసీ ప్రజలు ఇవాళ రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వస్తున్న అవకాశాలు దక్కించుకుంటున్న ఈ వర్గాలు అత్యుత్తమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయని హోమంత్రి తెలిపారు. హోంమంత్రులుగా ఇద్దరు ఎస్సీ మహిళలకు అవకాశం ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు.
సామాజిక న్యాయం తూచా తప్పకుండా పాటిస్తున్న సీఎం జగన్‌ను చూసి కొందరు ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. సహవిద్యార్థుల మధ్య జరిగిన పాత గొడవల నేపథ్యంలో జరిగిన ఘర్షణలను ప్రభుత్వానికి అధికార పార్టీకి ఆపాదిస్తూ దుర్మార్గపు ప్రచారానికి దిగుతున్నారని మంత్రి అన్నారు. కంచికచర్ల ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందనే విషయాన్ని గుర్తుచేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా వారిని రిమాండుకు పంపిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. అంతేకాదు టీడీపీ నేతలు ఎస్సీలను చిన్నచూపు చూస్తూ వారిని పలు రకాలుగా దూషించారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు.ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి గురించి మాట్లాడే హక్కు టీడీపీకి కానీ ఆ పార్టీ వారికి కానీ లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీలపై నేరాల నిరోధంలో కానీ, ఆ నేరాలకు పాల్పడ్డ వారికి సరైన శిక్ష విధించడంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న చొరవ దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఇక బాధితులు స్వేచ్ఛగా వచ్చి ఫిర్యాదు చేసి న్యాయం పొందేలా తగిన వాతావరణం కల్పించామని అన్నారు. ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా, విచారణ పరంగా న్యాయప్రక్రియను వేగవంతం అయ్యేలా తీసుకున్న చర్యలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయని తానేటి వనిత చెప్పారు.
పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పిన వనిత.. సచివాలయ సిబ్బందిలో ఒకరిని మహిళా పోలీసుగా నియమించిందన్నారు. తద్వారా రాష్ట్రంలో 15వేల మందికిపైగా మహిళా పోలీసులు గ్రామ వార్డు సచివాలయాల్లో సేవలందిస్తున్నారని చెప్పారు.సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరొక ప్రతిష్టాత్మక విప్లవాత్మక మార్పు దిశ అని చెప్పిన మంత్రి... ఆపదలో ఉన్నవారికి, బాధితులకు అందుతున్న సేవలు విశేషమైనవని కొనియాడారు.ఇప్పటికే 1.52 కోట్ల మంది దిశయాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పిన మంత్రి 28,585 ఘటనల్లో బాధితులు దిశ సహాయం అందుకున్నారన్నారు.
ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసుల విచారణకు తీసుకునే సమయం గణనీయంగా తగ్గిందని మంత్రి వెల్లడించారు.ఎస్సీ ఎస్టీ కేసుల విచారణలు 2022లో కేవలం 46 రోజుల్లోనే పూర్తవుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తులో లోపాలు జరగకుండా చూసుకోవడం, సాక్ష్యాలు వీగిపోకుండా ఉండేందుకు దర్యాప్తులో ఆడియో, వీడియో రికార్డింగ్ చేసే ఆక్యులస్ పరికరాన్ని దేశంలో మొదటి సారిగా ఏపీ సీఐడీ ఆగష్టు 2020లో తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కేసుల్లో బాధితులకు పరిహారం ఇప్పించడంలో ఏపీ సీఐడా మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం ద్వారా 2019 నుంచి 2022 వరకు రూ.159.304 కోట్లు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగిందన్నారు.
ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు బురదజల్లేందుకు టీడీపీ తయారైందని మంత్రి తానేటి వనిత అన్నారు.రాజకీయం చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వనిత మండిపడ్డారు.












Click it and Unblock the Notifications