ఎపి క్యాబినెట్ కీలక నిర్ణయం: సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు
విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలోని వివాదాస్పద సోంపేట థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సోంపేట పవర్ ప్లాంట్‌కు కేటాయించిన 972 ఎకరాల భూముల్లో మల్టీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. సోంపేట పవర్ ప్లాంట్ నిర్మాణానికి జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో పవర్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సాగిస్తున్న నిరాహార దీక్షలను ఉపసంహరించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆందోళనకారులను కోరారు.

గత ప్రభుత్వం సోంపేటలో థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు అనుమతిస్తూ ఎన్ఈసిఎల్‌కు 972 ఎకరాలు కేటాయించింది. ఈ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికంగా పెద్ద యెత్తున ఆందోళన చెలరేగింది. ఆందోళన పోలీసు కాల్పులకు కూడా దారి తీసింది. ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ స్థానికులు 2001 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
చిట్ ఫండ్స్ మోసాలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాల బాధితులకు సత్వరమే సాయం అందేలా చూడాలని కూడా మంత్రివర్గం అభిప్రాయపడింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది. అయితే, నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రికే అప్పగించింది. ఈ విషయంలో విద్యానిపుణుల సలహాలు తీసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications