తండ్రి అప్పు తీర్చలేదని పిల్లలను నిర్బంధించారు
చిత్తూరు: తండ్రి అప్పు తీర్చలేదని పిల్లలను నిర్భంధించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిర్బంధం నుంచి పిల్లలను విడిపించారు.
మదనపల్లె మండలం నీరుగట్టుపల్లెకు చెందిన చేనేత కార్మికుడు రాజు అతనికి భార్య హేమావతి, కుమారుడు సాయికిరణ్(7) ఉన్నారు. రాజు తన సమీప బంధువు ఉదయ్‌కుమార్ ఇంట్లోనే ఉంటూ మగ్గంపని నేర్చుకుంటున్నాడు. రాజు వ్యాపార నిమిత్తం అనంతపురం జిల్లా నారపల మండలానికి చెందిన రామక్రిష్ణ వద్ద 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.

ఈ మొత్తాన్ని విడతలవారీగా 1.40 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాడు. మిగిలిన 60 వేల రూపాయలు బకాయి పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈనెల 16న రామక్రిష్ణ మదనపల్లెకు వచ్చి బకాయి తీర్చాలని వత్తిడి తెచ్చాడు. పట్టణంలో వున్న స్నేహితుని వద్ద నుంచి డబ్బులు తీసుకొస్తానని బైటకు వెళ్లాడు. అయితే రాజు ఎంతకీ రాకపోవడంతో రాజు కుమారుడు సాయికిరణ్‌తో పాటు ఉదయ్‌కుమార్‌ను తీసుకుని అనంతపురం జిల్లాలో స్వగ్రామానికి వెళ్లిపోయాడు.
అక్కడ పిల్లలను నిర్బంధించి డబ్బులు కట్టి విడిపించుకెళ్ళాలని రాజుకు సమాచారం పంపాడు. దీంతో రాజు అతని భార్య హేమావతి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం పిల్లలను నిర్బంధం నుంచి విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. అక్రమంగా పిల్లలను నిర్బంధించిన రామక్రిష్ణపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications