ఉద్యోగం కోసం కన్నతండ్రినే చంపేసిన కిరాతకుడు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం కిరాతకుడు కన్నతండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. శ్రీకాళహస్తి మండలం ఎంఎంసీ కండ్రిగలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సింగలమాల సుబ్బరామయ్య (55) టీటీడీలో ఉద్యోగి. రోజు ఇంటి నుంచే వెళ్తూ తిరుమలలో తోటమాలిగా విధులు నిర్వహించేవాడు. ఈయనకు భార్య సుబ్బమ్మ, పిల్లలు పుష్పలత, వసంతకుమార్ ఉన్నారు. కూతురికి కొంతకాలం క్రితం వివాహమైంది. కొడుకు శ్రీకాళహస్తిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చాలా సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో చదవాలని మందలించాడు.

అయితే, తండ్రి ఉద్యోగాన్ని తనకు వీఆర్‌ఎస్ ద్వారా ఇప్పించాలంటూ కొంతకాలంగా గొడవపడుతున్నాడు. దీనికి తండ్రి ఒప్పుకోపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. తండ్రి ఉద్యోగం ఎలా వస్తుందనే వివరాలను టీటీడీ ఏడీ భవనంలో అధికారుల నుంచి ఆరా తీశాడు.
రిటైర్డ్‌మెంట్ గడువు దగ్గర పడటంతో ఉద్యోగం రావడం కష్టమని, ఒకవేళ రిటైర్డ్‌మెంట్ లోగా చనిపోతే మాత్రమే వస్తుందని చెప్పడంతో పథకం పన్నాడు. ఇంటికి తిరిగొచ్చి తండ్రితో బాగానే చదువుకుంటానని నమ్మించాడు. బుధవారం అర్థరాత్రి దాటాక వసంతకుమార్ గాఢనిద్రలో ఉన్న తండ్రిని కత్తితో దారుణంగా నరికిచంపాడు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications