ఎంపీలపై సోనియా గుర్రు, ఆరా!: టిడిపి అవిశ్వాస నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తమ పార్టీకి చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులు యూపిఏ ప్రభుత్వం పైన అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్పీకర్ మీరా కుమార్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆరుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని వెనుక ఎవరున్నారనే వివరాలపై ఆరా తీస్తోందట. వారిపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
అన్నింటికీ సిద్ధపడే: రాయపాటి
తాము అన్నింటికి సిద్ధపడే స్పీకర్‌కు అవిశ్వాసం నోటీసును ఇచ్చామని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు అన్నారు. ప్రజల నుండి సమైక్యాంధ్ర కోసం తమపై తీవ్ర ఒత్తిడి వస్తోందన్నారు. అందుకే తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. తమపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఊహించని రీతిలో మద్దతు వస్తుందని, ఎవరు మద్దతిస్తారో ఇప్పుడే చెప్పలేమన్నారు.

విభజనపై కేంద్రం ఏకపక్షంగా వెళ్తోందని ఎంపి సబ్బం హరి అన్నారు. తమకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ప్రజల అండ ఉందని చెప్పారు. సమైక్యం కోసం తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, తమను అనుమానించవద్దన్నారు.
మరో అవిశ్వాసం నోటీసు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ సభాపతి మీరా కుమార్‌కు కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన కాసేపటికే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కూడా అదే దారి పట్టారు. సోమవారం మధ్యాహ్నం టిడిపి ఎంపీలు నలుగురు (మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప) స్పీకర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.












Click it and Unblock the Notifications