తిరుపతి - షిరిడీకి ప్రత్యేక రైళ్లు: స్టాపులు, షెడ్యూల్..!!
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రముఖ పుణ్య క్షేత్రాలు అయిన తిరుపతి - షిర్డీ కి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రెండు నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపను న్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైళ్ల ప్రయాణ సమయాలు.. స్టాపుల వివరాలను అధికారులు వెల్లడించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి - షిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు. అందు లో భాగంగా తిరుపతి - సాయినగర్ శిర్డీ రైలు (07637) తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే 4 గంటలకు బయల్దేరి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10.45 గంటలకు శిర్డీకి చేరుకుంటుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులు అందిస్తుంది. అలాగే, శిర్డీ - తిరుపతి రైలు (07638) సోమవారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి ఆ తర్వాతి రోజు మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు (తెల్లవారితే బుధవారం) తిరుపతి చేరుకోనుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు నడవనున్నాయి.

ఈ రైళ్లు ఆగే స్టాపులను అధికారులు నిర్దారించారు. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహిరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గిర్, లాతూర్ రోడ్డు, పర్లి, గంగఖేర్, పర్భని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్‌సోల్, మన్మాడ్, కోపర్‌గావ్ స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఎసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే నర్సాపురం నుంచి అరుణాచలం కు ప్రత్యేక రైలును అధికారులు కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఈ రూటులో వందేభారత్ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications