చర్లపల్లి, అనకాపల్లి ప్రయాణికులకు రైల్వే మరో గుడ్ న్యూస్..! పండగల వేళ..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీ నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా పండుగల సీజన్, కొత్త ఏడాది సమీపిస్తుండటంతో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇప్పటికే నడుపుతున్న ప్రత్యేక రైళ్లను కొనసాగించక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో ఏపీ-తెలంగాణ మధ్య ఈ సీజన్ లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తున్నారు.
ఇదే క్రమంలో హైదరాబాద్ లోని చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లి వరకూ, అలాగే అనకాపల్లి నుంచి చర్లపల్లి వరకూ ఇప్పటికే నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అలాగే హైదరాబాద్ నుంచి వీటి టెర్మినల్ ను చర్లపల్లికి మారుస్తున్నారు. చర్లపల్లి నుంచి అనకాపల్లికి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07035ను డిసెంబర్ 6 నుంచి జనవరి 17 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన 7 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

అలాగే అనకాపల్లి నుంచి చర్లపల్లికి ప్రతీ ఆదివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07036 ను డిసెంబర్ 7 నుంచి జనవరి 18 వరకూ పొడిగిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన మరో ఏడు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండువైపులా ప్రత్యేక రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.












Click it and Unblock the Notifications