వైసీపీ నేత బీజేపీలో చేరికపై కూటమిలో చిచ్చు..!!
విశాఖ జిల్లాలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేత తాజాగా బీజేపీలో చేరారు. ఈ చేరికను కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న నేతను ఎలా చేర్చుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. తెలిసీ ఎందుకు చేశారోనన్న చంద్రబాబు .. తాను మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. ఇటు బీజేపీ చేరిక ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం కూటమిలో కొత్త చిచ్చుకు కారణమవుతోంది.
బీజేపీలోకి ఆడారి
విశాఖ కూటమిలో కొత్త వివాదం మొదలైంది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి బీజేపీలో చేరారు. ఇరువురూ రాజమండ్రిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త వివాదానికి దారి తీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను బీజేపీలో చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. నేరుగా చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.

అయ్యన్న ఆగ్రహం
ఆడారి ఆనంద్ వైసీపీలో కొనసాగుతూ తాజా ఎన్నికల్లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆడారి ఛైర్మన్ గా వ్యవహరించిన విశాఖ డెయిరీలో అవకతవకల పైన ఫిర్యాదులు రావటంతో ప్రభుత్వం విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో, పార్టీ మారేందుకు సిద్దమైన ఆడారికి టీడీపీ .. జనసేన లో అవకాశం దక్కలేదు. దీంతో, బీజేపీలో చేరినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడారి చేరిక పైన టీడీపీ, జనసేన నేతలు ఎంపీ సీఎం రమేశ్ ను ప్రశ్నించారు. అయితే, తనకు ఏమీ తెలియదని.. ఒక రోజు ముందు పురందేశ్వరి ఫోన్ చేసి ఆడారి ని చేర్చుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారని వెల్లడించారు.

చంద్రబాబు స్పందన
ఇక, ఆడారి చేరిక పై బహిరంగ సభలోనే స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేసారు. తాజాగా సీఎం చంద్రబాబు వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయ్యన్న వాదనతో ఏకీభవించిన చంద్రబాబు సమస్య వాళ్లకూ తెలుసు అని చెప్పుకొచ్చారు. అయినా, తెలిసి కూడా చేస్తే ఏమనాలి అంటూనే.. తాను మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆనంద్ బీజేపీలో చేరుతున్నారనే సమాచారం తో టీడీపీ నేతలు ముందుగానే బీజేపీ నేతలను అప్రమత్తం చేసారు. తొందర పడవద్దని సూచన చేసినా.. బీజేపీ నాయకత్వం ఆయన్ను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో.. ఇప్పుడు కూటమి నేతలు ఈ చేరిక పైన మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications