శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి ముఖ్య గమనిక
విశాఖపట్నం నుంచి వారణాసికి వెళ్లాలనుకునేవారికి భారతీయ రైల్వే శుభవార్తను వినిపించింది. వైజాగ్ నుంచి బనారస్ కు నేరుగా రైలు నడుపుతోంది. నిన్నటివరకు కాశీ వెళ్లాలంటే విశాఖపట్నం ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వచ్చేది. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లి అక్కడ మళ్లీ రైలు మారాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైలు నెంబర్ 18311 సంబాల్‌పూర్ నుంచి బనారస్‌కు అందుబాటులో ఉంది. ఇదే రైలును విశాఖపట్నం వరకు పొడిగించారు. కాశీ వెళ్లాలనుకునే ఉత్తరాంధ్రవాసులకు విశాఖపట్నం-వారణాసి రైలు సమకూరింది.
ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వేశాఖ, రైల్వే బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ప్రజలు కొన్నాళ్లుగా ఈ రైలు కోసం ఎదురుచూస్తున్నారని, వారికోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. దీనికోసం పార్లమెంటులో పలుసార్లు చర్చించానని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

వారానికి రెండురోజులు అందుబాటులో ఉండనుంది. ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ఏపీలో కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లలో ఆగుతుంది. సంబల్ పూర్ మీదగా వారణాసి చేరుకుంటుంది. తెల్లవారుజామున 4.10 గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9 .25 గంటలకు కాశీ చేరుకుంటుంది. ఇదే రైలు(18312) ప్రతి గురువారం, సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు బనారస్ లో బయలుదేరి తర్వాతరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications