తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ప్రత్యేక బాదుడు కూడా, ఈ మార్గాల్లో రైళ్లు రద్దు
హైదరాబాద్: ప్రత్యేక రైళ్ల ప్రత్యేక బాదుడు మరో రెండు నెలలు కొనసాగనున్నాయి. పండగలు, వేసవి సమయంలో రద్దీ ఉండే మార్గాల్లో రైల్వే అధికారులు రెగ్యులర్ రైళ్లకు అదనంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, వీటిలో ఛార్జీలు కొంత అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇలా రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
రద్దీ రూట్లలో 15 ప్రత్యేక రైళ్లను నవంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఇప్పటికే రైల్వే అధికారులు ప్రకటించారు. తాజాగా, మరో 22 రైళ్లను పొడిగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లలో రెండు నెలలపాటు అదనపు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రత్యేక రైళ్లలో తరగతిని బట్టి అదనపు ఛార్జీలు నిర్ణయిస్తారు. సాధారణంగా చెప్పాలంటే.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు రెగ్యులర్ రైలు గౌతమి టికెట్లతో పోలిస్తే లింగంపల్లి-కాకినాడ ప్రత్యేక రైలు(నెం. 07445/07446)లో ప్రయాణ తరగతి ఆధారంగా ఒక్కో టికెట్‌పై రూ. 55 నుంచి గరిష్టంగా రూ. 320 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఈ రైళ్లు సమయానికి రాకపోవడం, గమ్యస్థానానికి ఆలస్యంగా వెళ్లడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ గా మారిస్తే సాధారణ ఛార్జీలు ఉంటాయని, ప్రయాణానికి నిర్దిష్ట సమయం కూడా కేటాయించడం జరుగుతుందని ప్రయాణికులు అంటున్నారు.
కాజీపేట-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-హైదరాబాద్, మచిలీపట్నం-సికింద్రాబాద్, హైదరాబాద్-తిరుపతి, కాజీపేట-దాదర్, హైదరాబాద్-రక్సౌల్, కాచిగూడ-మధురై, కాచిగూడ-నాగర్ సోల్, సికింద్రాబాద్-రామనాథపురం, తిరుపతి-సాయినగర్ షిర్డీ, తిరుపతి-అకోలా, నాగర్ సోల్-విజయవాడ, మచిలిపట్నం-ధర్మవరం తదితర రైళ్లు పొడిగించారు.
ఈ మార్గాల్లో రైళ్లు రద్దు
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం 14 రైళ్లను వారంపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ-గుంటూరు, మెదక్-కాచిగూడ, కాచిగూడ-మెదక్, కాచిగూడ-నడికుడి, గుంటూరు-డోన్, విజయవాడ-హుబ్బాళి, గుంటూరు-విజయవాడ తదితర రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కొన్నింటిని అక్టోబర్ 2-8 వరకు, మరికొన్నింటిని 3-9 వరకు రద్దు చేసింది. కాగా, మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. వీటిలో రేపల్లె-మార్కాపురం రోడ్ రైలును అక్టోబర్ 2-8 వరకు గుంటూరు-మార్కాపురం రోడ్ మధ్య, మార్కాపురం-తెనాలి రైలును 2-8 వరకు మార్కాపురం రోడ్-గుంటూరు మధ్య రద్దు చేశారు.












Click it and Unblock the Notifications