కల్తీ మద్యం దొరికినా ఆగని అమ్మకాలు-బెజవాడ షాపులో రచ్చ రచ్చ..!
ఏపీలో కల్తీ మద్యం కారణంగా పలువురు చనిపోయారన్న ఆరోపణలు రావడం, అన్నమయ్య జిల్లా ములకలచెరువులో భారీగా మద్యం బాటిల్స్ పట్టుబడటం, ఈ ఘటనలో ఇప్పటికే 14 మందిని పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే విపక్ష వైసీపీ నిరసనలు చేపడుతోంది. అదే సమయంలో ఇవాళ విజయవాడలో రాజకీయ పార్టీలు ఓ కల్తీ మద్యం షాపుపై దాడికి దిగాయి. తాజాగా కల్తీ మద్యం పట్టుబడినా తాత్కాలికంగా మూసేసి మళ్లీ తెరిచిన ఆ షాపుపై దాడికి దిగాయి.
విజయవాడలో నకిలీ మద్యంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. కల్తీ మద్యం పట్టుబడినా విజయవాడ విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్ లో అమ్మకాలు ఆగలేదు. దీనిపై సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ భారీ నిరసన జరిగింది. నకిలీ మద్యం అమ్మిన షాపును మహిళలు, సీపీఎం కార్యకర్తలు మూయించేశారు. అందులో నకిలీ మద్యం సీసాలను పగలగొట్టి మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి ఎక్సైజ్, పోలీసు అధికారుల హామీతో వారు ఆందోళన విరమించారు.

నకిలీ మద్యం కుంభకోణంపై ప్రభుత్వం మొక్కుబడి చర్యలు తీసుకుంటోందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.వైసీపీ బాటలోనే కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తోందని ఆరోపించాయి. మద్య నియంత్రణపై మాట తప్పి, మోసం చేసిన కూటమి ,ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సీపీఎం నేతలు హెచ్చరించారు. దశల వారీ మద్య నియంత్రణ చేస్తామని, నకిలీ మద్యాన్ని అరికడతామని, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాలు కాపాడుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దగా చేసిందని, మాట తప్పిందని వారు ఆరోపించారు.

అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో నకిలీ మద్యం కుంభకోణం బట్టబయలు అయిందని, తెలుగుదేశం నేత జయ చంద్రారెడ్డి నేతృత్వంలోనే రాష్ట్రమంతా ఈ కల్తీ మద్యం దందా సాగుతుందని వెల్లడైందని సీపీఎం నేతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయవాడతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కల్తీ మద్యం దందా విస్తరించిందన్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఈ కల్తీ మద్యం కుంభకోణానికి కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. రెండు సంవత్సరాలుగా ఈ దందా సాగుతుందని చెబుతున్న కూటమి, నకిలీ మద్యం అమ్మే నేతలను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు? టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications