విభజన ఎఫెక్ట్: జగన్ గూటికి ఎంపి ఎస్పీవై! మరికొందరు
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఆయన శుక్రవారం రాత్రి జగన్‌ను ఆయన నివాసంలో కలవనున్నారు. అనంతరం జగన్ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పలువురు కాంగ్రెసు పార్టీ అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. విభజన నిర్ణయాన్ని అధిష్టానం వెనక్కి తీసుకునే అవకాశాలు లేకపోవడంతో పలువురు నేతలు కాంగ్రెసు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

గురువారం మంత్రి పినిపె విశ్వరూప్ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా జగన్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. విశ్వరూప్, ఎస్పీవై రెడ్డి బాటలోనే మరికొందరు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు నడిచే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు మాజీ మంత్రి, జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మోపిదేవి వెంకటరమణను వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశముంది. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలవనున్నారు.












Click it and Unblock the Notifications