TTD:రథసప్తమి నాడు శ్రీవారి దర్శనం, వాహనసేవ - టీటీడీ కీలక నిర్ణయాలు..!!
Tirumala: రథసప్తమికి తిరుమలలో ప్రత్యేకత ఉంది. మినీ బ్రహ్మోత్సవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున సప్త వాహనాల్లో శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. ఈ సారి రథసప్తమి నిర్వహణ కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవో శ్యామలరావు అధికారులతో సమీక్ష చేసారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలతో పాటుగా సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
మినీ బ్రహ్మోత్సవం
ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులు గ్యాలరీ లోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను టిటిడి ఈవో పరిశీలించారు.

సప్త వాహనాల పై
రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. ప్రతి సంవత్సరం శుక్ల పక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు. ఉ. 5.30 - 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) - సూర్య ప్రభ వాహనం పైన, ఉ. 9 - 10 గంటల వరకు - చిన్న శేష వాహనం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు - గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు - హనుమంత వాహనం పై నుంచి స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు - చక్రస్నానం ఉంటుంది.
బ్రేక్ దర్శనాలు రద్దు
తిరిగి సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం పైన విహరించనున్నారు. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసారు. తిరుపతిలో ఫిబ్రవరి 3 - 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయకూడదని టీటీడీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications