తిరుపతి, పులివెందుల సహా: శ్రీస్వామి నారాయణ్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు
అమరావతి: శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఇవ్వాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లను నెలకొల్పడానికి ఆసక్తి చూపారు. దీనికోసం భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. భూములను కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యుడు సుఖ్ వల్లభ్ స్వామి, విజయవాడ బ్రాంచ్ ప్రతినిధి మంత్ర స్వరూప్ స్వామి, ట్రస్ట్ సభ్యులు శ్రవణ్ ప్రియ్ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ శాసన సభ్యుడు మల్లాది విష్ణు.. తదితరులు ఈ సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని శాలువా కప్పి సన్మానించారు.

విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి తాము ఆసక్తిగా ఉన్నామని వారు తెలిపారు. దీనికి అవసరమైన భూములను కేటాయించాలని కోరారు. దీనికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నందుకు వారు వైఎస్ జగన్ ను అభినందించారు.
విద్యారంగంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలు, నాడు-నేడు, మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు ట్యాబ్లను ఇవ్వడం, తరగతి గదులను అత్యాధునికంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తోన్నందున శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ ప్రతినిధులు వైఎస్ జగన్ ను ప్రశంసించారు. అనంతరం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం తెలిపారు.
తిరుపతి, పులివెందుల సహా: శ్రీస్వామి నారాయణ్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు#YSJagan #APGovt #Tirupati #Pulivendula #InternationalSchools #APNews #oneindiatelugu pic.twitter.com/Pv3BVAgUvr
— oneindiatelugu (@oneindiatelugu) March 27, 2023
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్ద తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించారని గుర్తు చేశారు. ఆ స్థలంలో అత్యున్నత ప్రమాణాలతో ప్రతిష్ఠాత్మకమైన స్వామినారాయణ్ గురుకుల్ యూనివర్శిటీని ఏర్పాటుచేశామని వారు వివరించారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తోన్నామని ట్రస్ట్ ప్రతినిధులు వివరించారు.












Click it and Unblock the Notifications