చాలా భరించాం: సిఎంపై శ్రీధర్ బాబు వాగ్బాణాలు
హైదరాబాద్: తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై ఆయన సున్నితంగా వాగ్బాణాలు విసిరారు. వ్యక్తిగత అవమానాలను ఎన్నో భరించామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ వాటిని భరించామని, కీలకమైన సమయంలో తన శాఖను మార్చడం తెలంగాణను అడ్డుకునే కుట్ర అని ఆయన అన్నారు.
విభజన బిల్లుపై సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యుల అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో చూడడానికి ఇరు ప్రాంతాల ప్రజలు వేచి చూస్తున్నారని, ఇటువంటి సందర్భంలో కవ్వింపు చర్యలు సరి కావని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ బిల్లును ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఎత్తుగడలు వేస్తున్నారని, అందులో భాగంగానే తన శాఖను మార్చారని ఆయన అన్నారు.

తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించానని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా తాను రాజీనామా చేయలేదని, తెలంగాణ ప్రజలందరి తరఫున రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వ్యక్తిగా తాను ఏ విధంగా ఎదురు చూస్తున్నానో, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కూడా అదే విధంగా వేచి చూస్తున్నారని, ఈ విషయాన్ని సీమాంధ్ర నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఎవరు కవ్వింపు చర్యలకు దిగినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా స్వార్థంతో తాను రాజీనామా చేయలేదని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విదంగా పాపులు కదుపుతున్నందుకు నిరసనగానే తాను రాజీనామా చేశానని ఆయన అన్నారు. రాజీనామా చేయవద్దని కోరిన సహచర, సీనియర్ మంత్రులకు, సీనియర్ నాయకులకు ఆయన కృతజ్ఝతలు తెలిపారు. తమ తిరుగుబాటు తెలంగాణను అడ్డుకునే వ్యవస్థలపై, వ్యక్తులపై మాత్రమేనని ఆయన అన్నారు.
పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, పదవుల కోసం పాకులాడకుండా ప్రజల ఆశీస్సుల కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తన రాజీనామా విషయం చాలా చిన్నదని, తెలంగాణ తల్లులు తమ బిడ్డలను అర్పించి తెలంగాణ కోసం ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు శానససభకు వచ్చి చర్చ జరుగుతున్న సమయంలో తన శాఖను మార్చడం సీమాంధ్ర ప్రాంత నాయకుల మనస్తత్వాన్ని, కుట్రను బయటపెడుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ బిల్లును ఆపుదామనే తన శాఖను మార్చారని ఆయన అన్నారు. అది తెలంగాణ పౌరుల హక్కులను, అవకాశాలను లాక్కోవడమేనని, అధికార దుర్వినియోగమేనని ఆయన అన్నారు. ఇది తన ఒక్కడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాదని, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందని ఆయన అన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలు, దశాబ్దాల పోరాటం, పోరాట యోధుల రక్తతర్పణ కారణంగా తెలంగాణ కల నెరవేరుతున్న సందర్భంలో ఇటువంటి చర్యకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
తనకు పదవి కాలిగోటితో సమానమని, తాను రాజీనామా చేయడం సముద్రంలో ఇసుక రేణువంత కూడా కాదని ఆయన అన్నారు. తెలంగాణ సమాజంలో ఓ పౌరుడిగా తన బాధ తప్ప శాఖ మార్పు పెద్ద విషయం కాదని ఆయన అన్నారు.
సభలో చర్చ ప్రారంభమైంది.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందని ఆయన చెప్పారు. శాసనసభలో బిల్లును చదివి వినిపించడం అందరూ టీవీల్లో చూశారని, తాను చర్చను ప్రారంభించాలని కోరానని, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క బిల్లుపై మాట్లాడాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సూచించారని, ఇదంతా నిబంధనలకు, బిఎసిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే జరిగిందని ఆయన వివరించారు. చర్చే ప్రారంభం కాలేదని అసత్యాలు ప్రచారం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తనకు న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో చెప్పలేనని, కానీ తెలంగాణ పట్ల మాత్రం వివక్షథ జరిగిందని, బిల్లును ఆపే కుటిల ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. బిల్లుపై చర్చను కొనసాగించాలని, సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని, ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని, అసత్యాలు వద్దని ఆయన అన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగినా, జరగకపోయినా తెలంగాణను ఆపలేరని ఆయన అన్నారు.
బిల్లుపై జరిపి తిరిగి పంపితే ప్రజాస్వామికంగా ఉంటుందని చెబుతూ వస్తున్నామని, చర్చ జరిగితే రాజకీయ ప్రయోజనం పొందలేమని కొందరు భావిస్తున్నారని శ్రీధర్ బాబు అన్నారు. సంప్రదాయాలను, నిబంధనలను ఉల్లంఘించి తీర్మానం పెట్టాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారని, ఏం చేసినా తెలంగాణ ప్రక్రియ ఆగదని ఆయన అన్నారు. చర్చ ప్రారంభమైనప్పుడు అది పూర్తి కావాలని, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రాజకీయాల కోసం ఎత్తుగడలు వేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని శ్రీధర్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను అనుసరించి, పార్లమెంటరీ విధానాలను పాటించి ఆదర్శంగా నిలువాలని ఆయన సూచించారు. పరిపక్వత లేని వ్యవహారాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేవని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పాం
తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చాలా సార్లు చెప్పామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాననిి ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారని, అందుకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు తమ పట్ల వ్యతిరేకత వచ్చినా తట్టుకుని పరిపాలనకు ఇబ్బంది కలగకుండా తాము చూశామని ఆయన అన్నారు.
పలు విషయాలపై అంతర్గతంగా మాట్లాడమే తప్ప బహిరంగంగా మాట్లాడలేదని, పలుమార్లు అవమానాలకు గురయ్యామని, అయినా భరించామని ఆయన అన్నారు. దివంగతుడైన తన తండ్రి పట్ల అవమానకరంగా మాట్లాడినా భరించానని ఆయన చెప్పారు. ఇదంతా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించాలనే ఉద్దేశంతోనే భరించామని ఆయన చెప్పారు.
రాజీనామా చేయాలని తనపై ఒత్తిడి వచ్చినా కీలకమైన సమయంలో నియమనిబంధనలను పాటించి, న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు నడిచి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సి ఉంటుందనే భావనతోనే ఇంత కాలం కొనసాగానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియకు అండగా నిలబడాలనే సమయం వస్తుందనే ఉద్దేశంతోనే గతంలో రాజీనామా చేయలేదని ఆయన అన్నారు. సామాజిక తెలంగామ, అభివృద్ధికరమైన తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ రావాలనే వారి పక్షాన నిమిత్తమాత్రుడిగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
గ్రేటర్ హైదరాబాదులో కొన్ని గ్రామాలను కలిపే సమయంలో ఆ గ్రామాల ప్రజల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను ఉపయోగించిందని, అలాగే కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలతో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications