పట్టు: మంత్రి పదవికి శ్రీధర్ బాబు రాజీనామా
హైదరాబాద్: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖను ప్రత్యేక దూత ద్వారా గురువారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపించారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరిగే కీలక సమయంలో తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖ తప్పించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా చేశారు. సహచరులు, సీనియర్లు వద్దని వారించినా శ్రీధర్‌బాబు వినలేదు.
రాజీనామా లేఖను పట్టుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేందుకు శ్రీధర్ బాబు ఇష్టపడలేదు. ప్రత్యేక దూత ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. అయితే... ఈ రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదు. దాన్ని పెండింగులో పెట్టారు. రాజీనామా చేయకుండా శ్రీధర్‌బాబుకు సర్దిచెప్పేందుకు తెలంగాణ ప్రాంత సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. సహచర మంత్రులతో పాటు ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి దామోర రాజనరసింహ కూడా నచ్చజెప్పారు.

పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను అంకుల్ అని సంబోధిస్తూ ఆయన సలహాలను పాటించే శ్రీధర్‌బాబు ఈ విషయంలో మాత్రం తన పట్టు వీడలేదు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కుంతియాతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఒక హోటల్‌లో మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీధర్‌బాబును శాసనసభా వ్యవహారాల నుంచి తప్పించడంపై చర్చ జరిగింది. శ్రీధర్‌బాబుతో కుంతియా మాట్లాడి తన వద్దకు రావాలని కోరారు.
హోటల్‌లో జానారెడ్డి, కుంతియాలతో కలసి శ్రీధర్‌బాబు చర్చించారు. రాజీనామా చేయవద్దని శ్రీధర్‌బాబుకు కుంతియా సూచించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తోనూ మాట్లాడించారు. రాజీనామా వద్దని ఆయన సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ వరకు కుంతియా, జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఒకే వాహనంలో వెళ్లారు. ఈ సమయంలో చాలా సేపు శ్రీధర్‌బాబుకు నచ్చజెప్పే యత్నం చేశారు.
చివరగా, గురువారం రాత్రి సీమాంధ్రకు చెందిన మంత్రులు కొండ్రు మురళీ మోహన్, పసుపులేటి బాలరాజు కూడా శ్రీధర్ బాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తన నియోజకవర్గం నుంచి తండోపతండాలుగా కార్యకర్తలు వచ్చారు. వారందరితో ఒకవైపు మాట్లాడుతూనే రాజీనామా లేఖను సిద్ధం చేయించారు. ప్రత్యేక దూత ద్వారా దానిని సీఎం క్యాంపు కార్యాలయానికి పంపారు.












Click it and Unblock the Notifications