టీడీపీలోకి శ్రీశైలం ఎమ్మెల్యే?: వలసలకు వైయస్ జగన్ బ్రేక్ వేయలేకపోతున్నాడా?
అమరావతి: ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' ద్వారా వైసీపీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు ద్వారా వైసీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. తాజాగా కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది.
వైసీపీకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం తన నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. కార్యకర్తలతో సమావేశమైన ఆయన, వారి అభీష్టం మేరకు పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలిపారు.
అలాగే ఆదివారం సాయంత్రం తన స్వగ్రామమైన వేలుపన్నూరులో తన కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచారణను ప్రకటించనున్నారు. గత కొన్ని రోజులుగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టీడీపీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన సోమవారం తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారు. రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లనున్నారనే వార్తలు రావడంతో వైసీపీ విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుజ్జగింపు చర్యలు చేపట్టారు.
ఈ బుజ్జగింపు చర్యలు విఫలమై బుడ్డా రాజశేఖర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ సైతం బుడ్డాతో ఫోన్‌లో మాట్లాడే యత్నించగా ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసం, చంద్రబాబు పాలనపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం అనంతపురం జిల్లా కదిరి వైసీపీ ఎమ్మెల్యే చాంద్ భాషా విజయవాడలో చంద్రబాబు సమక్షంలో చాంద్ భాషా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. చాంద్ భాషా చేరికతో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 13కు పెరిగింది.












Click it and Unblock the Notifications