తిరుపతిలో వైసీపీ-జనసేన స్టిక్కర్ వార్- జగన్ స్టిక్కర్లపై పవన్ ఫొటోలు, నినాదాలు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జగనన్నే మా భవిష్యత్తు-మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఓ భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వైసీపీ నేతలు జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి తిరుపతిలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతిలో వైసీపీ నేతలు అతికించిన జగన్ స్టిక్కర్లపై జనసేన నేతలు వార్ ప్రకటించారు.
తిరుపతిలో ఇళ్లకు వైసీపీ జగన్ స్టిక్కర్లు అంటించడం మొదలుపెట్టగానే జనసేన కూడా పోటీగా స్టిక్కర్ వార్ మొదలుపెట్టింది.నిన్నటి నుంచి ఇంటింటికి వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ నినాదంతో వైసీపీ నేతలు స్టిక్కర్లు వేస్తున్నారు. జనం అనుమతితోనే తాము స్టిక్కర్లు వేస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే జనసేన నేతలు మాత్రం వీటికి పోటీగా.. వాటిపైనే మరో స్టిక్కర్ వేస్తున్నారు. దీంతో ఈ రెండు స్టిక్కర్లు చూపరుల్ని ఆకర్షిస్తున్నాయి.

తిరుపతిలో ఇళ్లకు వైసీపీ నేతలు మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు వేస్తుండగా.. జనసేన నేతలు అవే ఇళ్లకు వెళ్లి అక్కడ అతికించిన స్టిక్కర్లపైనే పోటీగా మాకు నమ్మకం లేదు జగన్, మా నమ్మకం పవన్ పేరుతో స్టిక్కర్లు వేయడం మొదలుపెట్టారు. ఇలా పలుచోట్ల వారు వైసీపీకి పోటీగా స్టిక్కర్లు వేశారు. అదీ పక్కన ఎక్కడో వేసుకోకుండా వైసీపీ స్టిక్కర్లపైనే వేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications