పవన్ కళ్యాణ్‌పై రాయితో దాడికి యత్నం: తర్వాత ఏం జరిగిందంటే?
తెనాలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాయి దాడి ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో రాయితో దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరాడు.
అయితే, ఆ రాయి పవన్‌కు తగలకుండా.. సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ వ్యక్తి రాయితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మరుసటి రోజే పవన్ కళ్యాణ్ పై దాడి యత్నం జరగడం చర్చనీయాంశంగా మారింది.

శనివారం రాత్రి విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
మరోవైపు, తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నం గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపై రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే, ఆ రాయి చంద్రబాబుకు తాకకుండా పక్కన పడింది. దీంతో రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాళ్ల దాడుల ఘటనలపై చంద్రబాబు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications