నువ్వు అయినా ప్రశాంతంగా ఉండు.. చావు అయినా బ్రతుకు అయినా నీతోనే ..!
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబ సమస్యలు, మానసిక ఆవేదనల కారణంగా ఓ దంపతులు తమ చిన్నారితో కలిసి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకోవడం విషాదాంతానికి దారితీసింది. తమ బిడ్డతో కలిసి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా.. భార్య, చిన్నారి మృతి చెందారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన కుంభా గోపి, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకరకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుని, ఉద్యోగ రీత్యా భోపాల్‌లో స్థిరపడ్డారు. గోపి ఎయిమ్స్‌లో మత్తు వైద్యుడిగా (అనస్తీషియా స్పెషలిస్ట్) పనిచేస్తుండగా, శంకరకుమారి అదే ఆసుపత్రిలో నర్సుగా సేవలందిస్తున్నారు.
వీరికి మౌనిక అనే మూడేళ్ల కుమార్తె ఉంది.

అయితే చిన్నారికి మానసిక, శారీరక ఎదుగుదల సరిగా లేకపోవడం దంపతులకు తీవ్ర ఆందోళన కలిగించేది. బిడ్డ భవిష్యత్తుపై ఆలోచిస్తూ వారు తరచూ మానసికంగా కృంగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి క్రమంగా వారిపై ఒత్తిడిని పెంచిందని తెలుస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం శంకరకుమారి తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం గోపి కూడా భోపాల్ నుంచి వచ్చి వారిని కలిశాడు. శనివారం రాత్రి భార్య, బిడ్డతో కలిసి నరసరావుపేటకు వచ్చి ఒక లాడ్జిలో దిగినట్లు సమాచారం.
లాడ్జిలో విషాదం..
అక్కడ ముగ్గురూ కలిసి మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం గోపి తన సోదరికి వాట్సప్ ద్వారా కొన్ని ఫోటోలు పంపి, తాము చనిపోతున్నామని తెలియజేశాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పంపిన లొకేషన్ ఆధారంగా లాడ్జికి చేరుకున్నారు. ఘటనా స్థలికి చేరుకునే సరికి ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, శంకరకుమారి మరియు చిన్నారి మౌనిహ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.
వాట్సప్ సందేశాల్లోనే ఆఖరి సంకేతాలు..
ఈ విషాదానికి ముందు భార్యభర్తల మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. "పాప, నేను కలిసి చనిపోతాం.. నువ్వైనా కష్టాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి" అని భర్త పంపిన సందేశానికి.. "చావైనా బతుకైనా నీతోనే... ముగ్గురం కలిసే చనిపోదాం" అని భార్య సమాధానం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను దంపతులు ముందుగానే ప్రణాళిక ప్రకారం అమలు చేసినట్లు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వారు ఈ నిర్ణయంపై చర్చించినట్లు ఆధారాలు లభించాయని సీఐ తెలిపారు. లాడ్జి సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, మెడికల్ వివరాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications