అప్పుడు చంద్రన్న.. ఇప్పుడు జగనన్న.: మతమార్పిడి నిరోధక చట్టం తెస్తామంటూ సునీల్ దియోధర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్. ఏపీలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి స్వంతంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసే సత్తా లేదన్నారు. ఏపీలో సొంత పార్టీ కార్యకర్తలపైనే వైసీపీ దాడులకు దిగుతోందన్నారు సునీల్ దియోధర్

ఏపీలో పరిస్థితులు దారుణం: సునీల్ దియోధర్
ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేయటం అమానుషమని సునీల్ దియోధర్ మండిపడ్డారు. ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. గుప్తా ఇంటికి ఆయన్ను పరామర్శించేందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తే ఆయన అక్కడ లేరట.. వైసీపీ నేతలు ఆయన కుటుంబాన్ని బలవంతంగా తిరుమల బాలాజీ దర్శనానికి పంపారట.. ఇది మరీ విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా భూమి లభించడం లేదని సునీల్ దియోధర్ అన్నారు. ప్రజలు చూస్తు ఊరుకోరని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయం మేరకు పనిచేయాలన్నారు.

మత స్వేచ్ఛకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం: సునీల్ ధియోధర్
మత స్వేచ్ఛ హక్కు అందరికి ఉందని, దానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లడం సరికాదని సునీల్ దియోధర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తోందన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే... రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలకు గత ప్రభుత్వం చంద్రన్న పేరు పెట్టుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న పేరుతో అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సునీల్ దియోధర్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తున్నారని అదికార పార్టీ నేతలపై సునీల్ దియోధర్ మండిపడ్డారు. పాస్టర్లకు జీతాలు చెల్లిస్తున్నారు.

ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందంటూ సునీల్ దియోధర్ ఫైర్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని మండిపడ్డారు. సీఎం జగన్ సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైందని.. ఏపీలో వైసీపీ నేతలు రౌడీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. వైసీపీ పాలనలో భూములు కబ్జాకు గురవుతున్నాయని, వైసీపీ నేతలు లిక్కర్, శాండ్, గంజాయి, డ్రగ్స్, లాండ్ మాఫియాలుగా మారిపోయిదోచుకుంటున్నారని ఆరోపించారు. శ్రీకాళహస్తి నుంచి నడికుడి రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు సునీల్ దియోధర్. గనులు ఉన్న ప్రాంతాల్లో నీటిని తాగి జనం వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఏపీ పునర్మిర్మాణాకి అవసరమైన సహకారం, నిధులు అందించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు, నిర్మాణ రంగాలకు భూములను కేటాయించడం లేదన్నారు. చందవరం లాంటి బౌధ్ద ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదన్నారు. చందవరాన్ని బుద్ధుడు, ఆయన కుమార్తె సంగమిత్రలు సందర్శించారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తే జపాన్, శ్రీలంక దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారని.. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు.












Click it and Unblock the Notifications