కౌంటింగ్ వేళ.. సుప్రీంకోర్టులో వైసీపీకి బిగ్ షాక్: జాగ్రత్త పడక తప్పదు
AP Postal ballot 2024: ఓట్ల లెక్కింపు గడువు సమీపించిన ప్రస్తుత సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన ప్రత్యేక నిబంధనలపై సడలింపు ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన పిటీషన్‌ను తోసిపుచ్చింది.
పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈసీ జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ తాజా ఉతర్వులపై సడలింపులు ఇవ్వాలని కోరింది.

ఏపీ మినహా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న నియమ, నిబంధనలన కొనసాగించేలా ఆదేశాలను జారీ చేయాలంటూ తన అప్పీల్ పిటీషన్‌లో అభ్యర్థించింది. గతంలో ఇదే అంశంపై వైఎస్ఆర్సీపీ ఏపీ హైకోర్టులో న్యాయపోరాటం చేసినప్పటికీ అది విఫలమైంది. సడలింపులను ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది వైఎస్ఆర్సీపీ. ఏపీలో మాత్రమే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ఈ పిటీషన్ ఈ ఉదయం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ సమక్షానికి వచ్చింది.
వైఎస్ఆర్సీపీ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు. ఈసీ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనలు సమూలంగా మారాయని, ఇది ఏపీకి మాత్రమే వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని అన్నారు. ఫామ్ 13ఏ, అటెస్టేషన్ అధికారి పేరు, హోదా లేకుండా కూడా ధృవీకరణ అధికారి సంతకంతో మాత్రమే ఆమోదించేలా సర్కులర్ ఇచ్చారని వివరించారు.
ఇది దుర్వినియోగానికి దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా సరే.. ఎవరి సంతకాన్ని అయినా పెట్టవచ్చని, స్టాంప్, హోదా లేని ఫామ్‌లను పరిగణనలోకి తీసుకుంటే అల్లర్లు సైతం జరిగే అవకాశం ఉందని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఏపీ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన విషయాన్ని సైతం సింఘ్వీ ప్రస్తావించారు. వాదనలను విన్న అనంతరం వెకేషన్ బెంచ్ కొట్టివేసింది. ఇందులో ఎలాంటి మెరిట్ కనిపించలేదని వ్యాఖ్యానించింది. విచారణను చేపట్టడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.












Click it and Unblock the Notifications