అవినాశ్ బెయిల్ పిటీషన్ పై సుప్రీం కీలక ఆదేశాలు..!!
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటీషన్ పైన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి పిటీషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే, అప్పటి వరకు సీబీఐ అరెస్ట్ విషయంలో ఏం చేస్తుందనే దాని పై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
సుప్రీంలో విచారణ వేళ : వైఎస్ వివేకా కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా అవినాశ్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ పెండింగ్ లో ఉంది. ఈ పిటీషన్ పైన రెండు సార్లు కోర్టులో విచారణ జరిగింది. పూర్తి విచారణ, తీర్పు కోసం జూన్ 6వ తేదీకి హైకోర్టు గతంలో వాయిదా వేసింది. దీంతో వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటీషన్ పైన వాదనలు..నిర్ణయం కోసం అవినాశ్ తరపు న్యాయవాదులు ప్రయత్నించారు.

సుప్రీం సీజే బెంచ్ కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ, విచారణ పైన స్పష్టత రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అవినాశ్ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారించిన జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ధర్మాసనం వాదించింది.
25న హైకోర్టులో విచారణకు ఆదేశం : సుప్రీంలో ప్రత్యేక మెన్షన్ చేసిన ఈ పిటీషన్ విచారణ సమయంలో ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. పిటీషన్ వెంటనే విచారణ అవసరం ఏంటని ప్రశ్నించింది. దీనికి అవినాశ్ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఇప్పటికే సీబీఐ ఎదుట అవినాశ్ ఏడు సార్లు విచారణకు హాజరయ్యారని వివరించారు. తిరిగి 12,16,19 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు.
సమయాభావం, తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేదని కోర్టుకు నివేదించారు. సీబీఐ ఎంపీ అవినాశ్ ను అరెస్ట్ చేసే విధంగా అడుగులు వేస్తుందని ఆందోళన ఉందని వెల్లడించారు. దీని పైన సునీత తరపు న్యాయవాది స్పందించారు. కోర్టులో తాము దాఖలు చేసిన పిటీషన్లు పెండింగ్ లో ఉన్న అంశాన్ని కోర్టుకు వివరించారు.

సీబీఐ అడుగులు ఎటు : అవినాశ్ బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో సీబీఐ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించ లేదు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించాలని కోరే హక్కు పిటిషనర్ కు ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ ను విచారణ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది.
ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన ఈ నెల 25న విచారణ జరగనుంది. అయితే, అప్పటి వరకు సీబీఐ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది. సీబీఐ 25వ తేదీ విచారణ వరకు వేచి చూస్తుందా..లేక కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications