సినిమా థియేటర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో బయటి ఆహారాన్ని అనుమతించే విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధం విధించే హక్కు మల్టీప్లెక్స్, థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని, అయితే చిన్నారులు, పిల్లల కోసం ఆహారం తెచ్చుకునే తల్లిదండ్రులను అనుమతించాలని సూచించింది. ప్రేక్షకులందరికీ కచ్చితంగా తాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంచాలని సూచించింది. థియేటర్లలోకి బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ 2018లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
థియేటర్లు, మల్టీప్లెక్స్ లు యజామానుల సొంత ఆస్తి అని, బయట నుంచి ఫుడ్ కి పర్మిషన్ ఇవ్వాలా? వద్దా? అనేదానిపై వారు నిర్ణయం తీసుకోవచ్చని, ఆ అధికారం వారికి ఉందని పేర్కొంది. ఎక్కడ సినిమా చూడాలి? ఏ థియేటర్ లో చూడాలి? అక్కడ అమ్మేవాటిని కొనాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకుడికి ఎలా ఉంటుందో అలాగే అక్కడకి బయటి ఆహారంపై షరతులు విధించాలా? వద్దా? అనే హక్కు కూడా ఉంటుందని వెల్లడించింది. అయితే థియేటర్ లోపల ఉన్నవాటిని కొనుగోలు చేసే విషయంలో ప్రేక్షకులను బలవంతం చేయకూడదని ఆదేశించింది.

థియేటర్లలో తినుబండారాల అమ్మకాలు, కొనుగోళ్లుకు సంబంధించి ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. కొన్ని థియేటర్ల యాజమాన్యం బలవంతంగా వాటిని అంటగడుతోందని వినియోగదారులు కోర్టును ఆశ్రయించారు. బయటివాటికన్నా ధరలు అత్యధికంగా ఉన్నాయంటూ మరికొందరు కోర్టులో పిటిషన్ వేశారు. చివరకు డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications