క్రిమినల్ ప్రొసీడింగ్స్‌లో చంద్రబాబుకు ఊరట దక్కేనా..?!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలను చేపట్టింది. దీనికి లభిస్తోన్న స్పందన అంతంత మాత్రమేనంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. చంద్రబాబు నేరం చేశాడనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెబుతోంది.
ఈ పరిస్థితుల్లో స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్.. నేడు సుప్రీంకోర్టు సమక్షానికి రానుంది. గతంలో ఏపీ హైకోర్టు ఈ పిటీషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని, అందుకే ఈ కేసులో కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని, ఈ కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ వేశారు చంద్రబాబు.
ఇదివరకు ఏపీ హైకోర్టు ఈ పిటీషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో- చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కిందటి నెల 27వ తేదీన తొలిసారిగా ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారించనున్నారు.
చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలను వినిపించనున్నారు. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఇదివరకే ఏసీబీ కోర్ట, హైకోర్టుల్లో కొట్టివేతకు గురైన పిటీషన్ ఇది. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications