అవినాశ్ వర్సస్ సీబీఐ, సునీత పిటీషన్ -సుప్రీంలో నేడే కీలకం..!!
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వర్సస్ సీబీఐ వ్యవహారం లో నేడు (మంగళవారం) కీలకం కానుంది. సుప్రీంకోర్టులో అవినాశ్ దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని అవినాశ్ సుప్రీంను కోరారు. ఇదే సమయంలో వివేకా కుమార్తె సునీతా దాఖలు చేసిన అప్లికేషన్‌ను అవినాశ్ దరఖాస్తుతో కోర్టు జత చేసింది. సుప్రీం వాదనలు విన్న తరువాత ఏం చెబుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
సుప్రీంలో విచారణ:ఎంపీ అవినాశ్ రెడ్డి రెండు అభ్యర్ధనలతో సుప్రీంలో అప్లికేషన్ దాఖలు చేసారు. వివేకా హత్య కేసులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరారు. తన తల్లికి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని కూడా అవినాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 6వ తేదీన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోర్టును అభ్యర్దించారు. లేదంటే ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించాలని ఆదేశించి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులివ్వాలని అవినాశ్ రెడ్డి తన పిటీషన్ లో కోరారు.

సునీత పిటీషన్ :ఇదే సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించవచ్చా లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌ను అవినాశ్ దరఖాస్తుతో కోర్టు జత చేసింది. ఈ రెండింటినీ కలిపి ఈ రోజు( మంగళవారం) జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన వెకేషన్ ధర్మాసనం ఎదుట 36వ విచారణ కేసుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది. సోమవారం అవినాశ్‌రెడ్డి అప్లికేషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఆయన తరఫున న్యాయవాదులు ప్రస్తావించారు. మంగళవారం నాటి కేసుల జాబితాలో ఈ అప్లికేషన్‌ను చేర్చాలని సీనియర్ న్యాయవాది వి.గిరి విజ్ఞప్తి చేశారు. మెన్షనింగ్ కార్యాలయానికి మీ న్యాయవాదిని పంపించి కేసును ప్రస్తావించమని చెప్పండి. సాధ్యమైతే మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్ ఆయనకు సూచించారు.
తప్పుకున్న జస్టిస్ కరోల్:సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వద్ద తన కుమారుడు న్యాయవాదిగా పనిచేస్తున్న నేపథ్యంలో జస్టిస్ కరోల్ విచారణ నుంచి వైదొలిగారు. అవినాశ్ తరపు పిటీషన్ దాఖలు చేసిన న్యాయవాదులు సీబీఐకు ఎంపీ అవినాశ్ రాసిన లేఖలను జత చేసారు. అవినాశ్- సీబీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, తల్లి ఆరోగ్యంపై ఆస్పత్రి విడుదల చేసిన బులెటిన్ వంటివి అదనపు డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు సమర్పించారు. దీంతో, ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ అవినాశ్ ఎపిసోడ్ లో కీలకం కానుంది.












Click it and Unblock the Notifications