చంద్రబాబుపై సీఐడీ నెక్స్ట్ స్టెప్ - సుప్రీం కీలక ఆదేశాలు..!!
చంద్రబాబు కేసుల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పైన విచారణ జరిగింది. డిసెంబర్ 12కు ఈ కేసుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో ఈరోజు (గురువారం) విచారణకు రాగా... జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే సమయంలో సీఐడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంలో విచారణ : చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో విచారణ సాగుతోంది. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తరువాత అనారోగ్య కారణాలతో హైకోర్టు తొలుత మధ్యంతర బెయిల్..ఆ తరువాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పైన సీఐడీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అయితే, చంద్రబాబుకు స్కిల్ కేసు గురించి ఎక్కడా మాట్లాడటానికి అవకాశం లేదని స్పష్టం చేసిన సుప్రీం..రాజకీయ సభల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు తరువాత ఈ పిటీషన్ విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.

సీఐడీకి ఆదేశాలు : ఇక, చంద్రబాబు తన పైన నమోదైన ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ కేసలన్నింటికీ క్వాష్ పిటీషన్ తీర్పు కీలకంగా మారుతోంది. దీనికి సంబంధించి కోర్టు స్పష్టత ఇచ్చింది. ఫైబర్ నెట్ కేసులో డిసెంబర్ 12 వరకు వరకూ చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో జారీచేసిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు రాస్తున్నామని న్యాయమూర్తి అనిరుద్ద బోస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12లోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్వాష్ పిటీషన్ లో 17ఏ కేంద్రంగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పుడు ఈ తీర్పు మిగిలిన కేసులకు కీలకంగా మారనుంది.
చంద్రబాబు పర్యటనలు : ఇటు చంద్రబాబు పైన నమోదైన మద్యం కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. దీని పైన సమయం కావాలని సీఐడీ కోర్టును కోరింది. ఇక, చంద్రబాబు తిరుమలకు బయల్దేరారు. ఈ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తరువాత అమరావతి చేరుకుంటారు. డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని, డిసెంబర్ 3న సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శనం చేసుకుంటారు. డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఆ తరువాత వరుసగా రాజకీయ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో..ఈ తీర్పు పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications