మెగా కుటుంబానికి ఏపీలో మరో పదవి..! మళ్లీ ట్రోల్స్ షురూ..!
మెగా కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో పదవుల పంట పండుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మెగా కుటుంబం నడుపుతున్న సఖ్యతే ఇందుకు కారణం. ఇప్పటికే ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఏపీ గ్రీన్ ఛైర్ పర్సన్ గా ఆయన సోదరుడు నాగబాబు పదవుల్లో కొనసాగుతుండగా.. ఇప్పుడు కూటమి సర్కార్ అదే కుటుంబానికి మరో పదవి ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణలో యాదాద్రి ఆలయ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖను సభ్యురాలిగా నియమించడంపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ .. ఏపీ సర్కార్ నిర్ణయంపై ఇంకా పెరిగాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితను (Sushmita Konidela ) నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె 'సుస్మిత కొణిదెల'ను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాల్లో సుస్మిత భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందిస్తారని అందులో పేర్కొన్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ తన కాంగ్రెస్, వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల్ని కుటుంబ పాలన పేరుతో విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు తానే స్వయంగా ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటూ, సోదరుడు నాగబాబును తన శాఖ పరిధిలోకి వచ్చే ఏపీ గ్రీన్ కు ఛైర్ పర్సన్ గా కేబినెట్ హోదాతో నియమించారు. ఇప్పుడు తన మరో సోదరుడు చిరంజీవి మొదటి కుమార్తె సుస్మితను విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. ఇప్పటికే సినీ పరిశ్రమలో స్టైలిస్ట్ గా, నిర్మాతగా రాణిస్తున్న సుస్మితకు ఉన్నట్లుండి దుర్గమ్మ ఆలయ బోర్డులో పదవి ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ఆమె తల్లి సురేఖకు ఇప్పటికే తెలంగాణలోని యాదాద్రి ఆలయ బోర్డులో సభ్యురాలిగా నియమించడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సుస్మిత నియామకంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి.












Click it and Unblock the Notifications
