పొత్తుపై బీజేపీ తాజా కండీషన్, ఇరకాటంలో పవన్ - చంద్రబాబు అంగీకరిస్తారా..!!
ఏపీలో పొత్తులు ఖాయమని చెబుతున్నా..అధికారికంగా ఖాయం కాలేదు. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని పవన్ స్పష్టం చేసారు. ఇదే పొత్తు పైన ఇప్పటి వరకు బీజేపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు వైసీపీ పూర్తిగా ఎన్నికల కోసం గ్రౌండ్ లోకి వచ్చేసింది. అభ్యర్దులను దాదాపు ఖరారు చేసింది. ఈ రెండు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. పొత్తు ఖాయం చేయాలంటే బీజేపీ కొత్త డిమాండ్లు తీసుకొస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది.
పొత్తుల లెక్కలు : టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను చివాట్లు తినాల్సి వచ్చిందని తాజాగా పవన్ చెప్పారు. పొత్తు కోసం చాలా తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్లటం ఖాయం అయింది. ఈ రెండు పార్టీలు తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి.

ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చల తరువాత ఇక పాత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనా వేసారు. ఈ నెల 7న చంద్రబాబు - అమిత్ షా భేటీ జరిగింది. 15 రోజులు అయింది. ఇప్పటి వరకు ఈ పొత్తు పైన అటు బీజేపీ, ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కదలిక కనిపించటం లేదు. పవన్ మాత్రమే మూడు పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు.
సీట్ల పైనే పట్టు : టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఏపీలో జగన్ ను ఓడించాలంటే అవసరమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీని కోసం బీజేపీ ముఖ్యులతో మంతనాలు చేసారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ 8-10 ఎంపీ స్థానాలు, 15-20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తోంది.
టీడీపీ నుంచి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించటం లేదు. జనసేన కు 3 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుండటంతో..బీజేపీకి ఇంతకు మించి అవకాశం లేదనేది టీడీపీ ముఖ్యుల వాదన. బీజేపీ మాత్రం తమ లక్ష్యం 400 ఎంపీ సీట్లుగా చెబుతూ..ఏపీలో తమకు 10 స్థానాలు కావాలని పట్టు బడుతోంది. 8 స్థానాల కంటే తాము తక్కువగా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సిద్దమేనా : పొత్తు చర్చలు ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు సీట్ల అంశం కీలకంగా మారుతోంది. బీజేపీ కోరుతున్నట్లుగా 8 ఎంపీ స్థానాలు ఇవ్వటం పైన చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. అందుకు అంగీకరిస్తే సొంత పార్టీ నేతల నుంచి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో, పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం పైన సందిగ్ధత కొనసాగుతోంది.
అటు ఎన్నికల షెడ్యూల్ మరో పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అందునా టీడీపీకి బలం ఉన్న స్థానాలనే బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కారణంగానే టీడీపీ నుంచి బీజేపీ తో పొత్తు పైన ఎలాంటి అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. అటు బీజేపీ నుంచి పొత్తు పైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో..ఇప్పుడు పొత్తులు..సీట్లు..సర్దుబాట్లు పైన అటు బీజేపీ - ఇటు చంద్రబాబు తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications