అలిగిన పిఠాపురం వర్మకు కేబినెట్ ర్యాంక్ పదవి?
SVSN Varma: కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మరోసారి తెర మీదికి వచ్చారు. ఆయన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారాయన. ఇక్కడ చోటు చేసుకుంటోన్న పరిణామాలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరును తెస్తున్నాయంటూ అసహనం తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ఆయనకు కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇవ్వబోతోందనే ప్రచారం రెండు రోజులుగా జోరుగా సాగుతోంది. ఆయనకు ఇద్దరు గన్ మెన్లను కేటాయించడానికి ఇదే కారణమనీ చెబుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని తెరమీదికి తీసుకొచ్చిన తర్వాత తనక గన్ మెన్లను కేటాయించాలని వర్మ గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారని, దీనికి సానుకూల స్పందన లభించిందని అంటున్నారు.

ఈ క్రమంలోనే ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్‌మెన్‌లను కేటాయించిందని ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం తాను గెలిచి తీరే పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేయడం, ఆయన విజయానికి అన్ని రకాలుగా అహర్నిశలు కృషి చేసినప్పటికీ.. ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించలేదని వర్మ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారనేది బహిరంగ రహస్యమే.
ఈ క్రమంలో ఆయనకు కీలక పదవిని ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వర్మకు గన్ మెన్లను కేటాయించారనీ ఉదహరిస్తోన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ గానీ ఖండించకపోవడం, తోసిపుచ్చకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఏర్పాటై ఇన్ని రోజులైనప్పటికీ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎటువంటి పదవీ దక్కకపోవడం పట్ల తలెత్తిన అసంతృప్తిని చల్లార్చే క్రమంలో ఈ పదవి కేటాయించడం దాదాపు ఖాయమైందనీ అంటున్నారు. దసరా తర్వాత దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications