డబ్బు ఇవ్వలేదనే మాపై కక్ష: జెసి దివాకర్‌రెడ్డిపై స్వామి ప్రబోధానంద సంచలన వ్యాఖ్యలు
అనంతపురం:డబ్బులు ఇవ్వనందుకే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తమపై కక్ష కట్టారని స్వామి ప్రభోదానంద సంచలన ఆరోపణలు చేశారు. ఆ కక్ష తోనే తమ ఆశ్రమాన్ని ఇక్కడ లేకుండా చేయాలని ఎంపి జెసి ప్రయత్నిస్తున్నారని ప్రబోధానంద ఆరోపించారు.
2003 లో కృష్ణమందిరం ప్రారంభోత్సవానికి ఎంపి జెసిని ఆహ్వానించామని , అప్పుడు డబ్బు ఇవ్వలేదనే ఆయన తమపై కక్ష గట్టారని ప్రబోధానంద వెల్లడించారు.
ఆ తరువాత ఆయన తమను వేధింపులకు గురిచేశారని స్వామి ప్రబోధానంద ఆరోపించారు. ఎంపి జెసి ఆ పాతకక్షలతోనే పక్క గ్రామాల ప్రజలను తమ పైకి ఉసిగొల్పారని స్వామి ప్రబోధానంద విమర్శించారు.

ఎంపి జెసి దివాకర్ రెడ్డిని ఉద్దేశించి స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ...''ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదు...మేం ప్రచారం కోసం పాకులాడటం లేదు...ఆశ్రమానికి ఐఏఎస్‌లు, ఇతర అధికారులు కూడా వస్తున్నారు...తప్పు జరిగితే జనం ఆశ్రమానికి వాళ్లు ఎందుకొస్తారు?...1993లో బీజేపీ కార్యకర్తలకు ఆశ్రయం ఇచ్చామని మమ్మల్ని తరిమికొట్టారు...అడిగినవారికి అన్నం పెట్టాం...రాజకీయాలతో మాకు సంబంధం లేదు...కొంతకాలం బెంగళూరులో ఉండి...2003లో మళ్లీ ఆశ్రమాన్ని ప్రారంభించాం"...అని చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే ప్రభోదానందస్వామి బోధనలు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని చెప్పడంతో పాటు ఆశ్రమంలో అనేక రకాలైన అసాంఘిక చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభోదానంద ఆశ్రమంలో అరాచకాలకు కొందరు రాజకీయ నాయకుల అండ ఉందని ఆయన స్పష్టం చేశారు. తనను నేరుగా ఎదుర్కొలేకనే కొందరు తెర వెనక ఉండి ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులను తనపైకి ఉసిగొల్పుతున్నారని జేసీ ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రభోదానంద ఆశ్రమంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం ఆశ్రమంలో పర్యటించింది. ఈ
కమిటీలో జెసి-2 సుబ్బరాజు, ఆర్డీవో మలోలా, డీఎస్పీ విజయ్‌కుమార్‌లతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమైన కమిటీ ప్రబోధానంద ఆశ్రమం గ్రామసమీపంలో ఉండడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పాలని స్థానికులను కోరింది.












Click it and Unblock the Notifications