వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టులో కదలిక: బ్రాహ్మణి స్టీల్స్ టేకోవర్ లేదా అక్కడే కొత్త ఫ్యాక్టరీ
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి బ్రాహ్మణి స్టీల్స్. కర్ణాటకకు చెందిన భారతీయ జనతాపార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అది. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిటిమిటి చింతల అనే తండా సమీపంలో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్లాంట్ రద్దయిందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం.

మళ్లీ కదలిక
తాజాగా- ఇప్పుడా భారీ ప్రాజెక్టులో మరోసారి కదలిక ఏర్పడింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎంఆర్ అనే సంస్థ బ్రాహ్మణి స్టీల్స్‌ను టేకోవర్ చేయడానికి ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రికి అందజేశారు.

టేకోవర్‌కే అవకాశాలు ఉన్నాయంటూ..
స్థలాన్ని కేటాయించడం, నీటి వసతిని కల్పించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున.. దానికి బదులుగా బ్రాహ్మణి స్టీల్స్‌ను టేకోవర్ చేయడానికి అవకాశాలను పరిశీలించాలని ఐఎంఆర్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. తాము ఇదివరకే బ్రాహ్మణి స్థలాన్ని పరిశీలించామని, తాము ప్లాంట్‌ను నెలకొల్పడానికి అనువుగా ఉంటుందని నిర్ధారణకు వచ్చామని అన్నారు. స్టీల్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిఇనుము కోసం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)తో ఒప్పందం కుదర్చుకోవాల్సి ఉందని చెప్పారు.

రూ. 12వేల కోట్ల పెట్టుబడి..
ఏటా 10 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, దీనికోసం తొలిదశలో 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుతున్నామంటూ వారు వివరించారు.

రవాణా, నీరు, విద్యుత్ సౌకర్యాలకు ఢోకా లేనట్టే..
ముద్దనూరు రైల్వే స్టేషన్, కృష్ణపట్నం పోర్టు, కడప విమానాశ్రయంతో పాటు మైలవరం, గండికోట రిజర్వాయర్లు, రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యంత సమీపంలోనే ఉండటం వల్ల సరుకు రవాణా, ఫ్యాక్టరీకి కావాల్సిన మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు ఢోకా ఉండదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించినట్లు తెలుస్తోంది. ఇదివరకు అదే ప్రాంతంలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన ఐఎంఆర్ ప్రతినిధులు..
నిజానికి- ఐఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఇదివరే ఒకసారి బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. గత ఏడాది ఆగస్టు 14వ తేదీన జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డితో కలిసి వారు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. బ్రాహ్మణి స్టీల్స్ యాజమాన్యం నిర్మించిన గెస్ట్ హౌస్, బ్లాస్ట్ ఫర్నేస్, వెల్డింగ్ షెడ్, పవర్ ప్లాంట్, సబ్ స్టేషన్ లను పరిశీలించారు. నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన రిజర్వాయర్ సెంట్రల్ ప్లాంట్ ను సైతం ఐఎంఆర్ ప్రతినిధులు తిలకించారు.












Click it and Unblock the Notifications