పవన్ ఆశలపై నీళ్లు - పొత్తులపై తేల్చేసిన బీజేపీ..!!
రెండు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం మొదలైంది. ఏపీలో లోక్ సభతో పాటుగానే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ సూచించారు. అటు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరానికి పార్టీలు సై అంటున్నాయి. ఈ సమయంలో పొత్తుల లెక్కలు కీలకం కానున్నాయి. బీజేపీ పొత్తుల పైన తమ వైఖరి ఏంటో తేల్చి చెప్పింది.
పొత్తులపై క్లారిటీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కసరత్తు పార్టీలు ప్రారంభించాయి. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుతో పోటీ చేసింది. ఎక్కడా డిపాజిట్లు రాలేదు. ఏపీలో ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పోటీ చేసినట్లు పవన్ స్పష్టం చేసారు. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో పొత్తుతో పోటీ చేసినట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక, ఇప్పుడు బీజేపీ నాయకత్వం జనసేనతో పొత్తు కారణంగా తెలంగాణ లో ప్రయోజనం లేకుండా పోయిందనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

ఎవరితో పొత్తు లేదు
బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన ఇంచార్జ్ లు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందన్నారు. అయితే అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఇప్పటి నుంచే దానికి అవసరమైన కసరత్తులు క్రిందిస్థాయి నుంచి ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉందని దానిని అందిపుచ్చుకోవాలని చెప్పారు. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.

బీజేపీకి అనుకూలం
ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అన్న వార్తలు పూర్తి అవాస్తవం అని తేల్చి చెప్పారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలని జిల్లా స్థాయి నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.రేపటి నుంచి భారత్ వికసిత్ యాత్ర తెలంగాణలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications