మొన్న గోడ..నిన్న గొయ్యి: తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత: మందుబాబుల కోసమేనా?
చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్.. సరిహద్దు వివాదాలకు దారి తీస్తోంది. మొన్నటిదాకా సఖ్యతగా ఉన్న రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి కారణమౌతోంది. చిత్తూరు జిల్లాలో తమ భూభాగంపై రోడ్డుకు అడ్డంగా సరిహద్దుల్లో మొన్నటికి మొన్న గోడ కట్టి.. అనంతరం దాన్ని కూల్చేసిన తమిళనాడు అధికారులు.. ఈ సారి కొత్త బాట పట్టారు. గోడ కడితే తొలగించాల్సి వస్తుందనే ఉద్దేశంతో..ఈ సారి గొయ్యిని తీశారు.. రోడ్డుకు అడ్డంగా. ఇదివరకు అదే చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో తమిళనాడు అధికారులు ఏకంగా ఓ గోడను కట్టారు. ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో దాన్ని కూలగొట్టారు.
తాజాగా రోడ్డుకు అడ్డంగా గొయ్యిని తవ్వారు. చిత్తూరు జిల్లా పిచ్చిటూరు మండలం సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిచ్చాటూరు మండలం హనుమంతాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మన రాష్ట్ర సరిహద్దులను ఆనుకుని ఉన్న తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలోనికి ప్రవేశించడానికి ఇదే ప్రధాన రహదారి. పిచ్చాటూరు వైపు నుంచి సత్యవేడుకు వెళ్లడానికీ ఈ మార్గాన్ని వినియోగిస్తుంటారు వాహనదారులు. ఈ మార్గంపై రాకపోకలు అడ్డుకోవడానికి తమిళనాడు అధికారులు రోడ్డుకు అడ్డంగా సుమారు ఆరు అడుగుల మేర గొయ్యి తీశారు. జేసీబీలతో రోడ్డును తవ్వేశారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే హనుమంతాపురం సహా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు చిత్తూరుజిల్లా ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమిళనాడు రెవెన్యూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. తాము రాకపోకలు సాగించడానికి అనువుగా ఉండే మార్గాన్ని మూసివేయడం తగదని అన్నారు. ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు, సమీప గ్రామస్తులు పెద్ద సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ డ్రైవర్‌నూ అడ్డుకున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది.
ఏపీలో మద్యం దుకాణాలను తెరిచిన నేపథ్యంలో.. సరిహద్దు గ్రామాలకు చెందిన పలువురు సరిహద్దులు దాటుకుని వస్తున్నారని, వారిని అడ్డుకోవడానికే రోడ్డుపై గొయ్యిని తవ్వినట్లు తిరువళ్లూర్ జిల్లా అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన సత్యవేడు సహా పిచ్చాటూరు మండలం నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారని, దీన్ని అడ్డుకోవడానికే ఈ చర్యను చేపట్టాల్సి వచ్చిందని అంటున్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందు వల్ల రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిషేధించడానికి ఇంతకంటే మంచి ఉపాయం లేదని తిరవళ్లూరు జిల్లా రెవెన్యూ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications