చంద్రబాబు బిగ్ స్కెచ్- టీడీపీలోకి వైసీపీ రెబల్స్, పొత్తులపైనా క్లారిటీ..!?
టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీలో కొత్త జోష్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు జరగుతున్న మహానాడును రాజకీయంగా సంచలనాలకు వేదిక గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ రెబల్స్ తో పాటుగా గతంలో పార్టీ వీడిన కొందరు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకొనేందుకు మహనాడు ముహూర్తంగా ఫిక్స్ చేసారు. అదే సమయంలో పొత్తులపైనా ప్రకటన చేసేందుకు మహానాడు వేదికగా మార్చుకోవాలని నిర్ణయించారు.
చంద్రబాబు కొత్త వ్యూహాలు : టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావటానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏ అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరు. గత ఏడాది ఒంగోలు కేంద్రంగా నిర్వహించిన మహానాడు సక్సెస్ కావటం ద్వారా పార్టీలో మరోసారి ఊపు కనిపించింది. ఇప్పుడు ఎన్నికల ముందు నిర్వహిస్తున్న మహానాడు మరింత జోష్ పెంచి..ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేసే విధంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

అందులో భాగంగా వైసీపీని నైతికంగా దెబ్బ తీసే ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. మహానాడు వేదికగా పార్టీలో చేరికలు..పొత్తులు.. ఎన్నికల వరాల పైన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజమండ్రి వేదికగా ఈ సారి మహానాడు జరగనుంది.
టీడీపీలో కీలక చేరికలు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఇంకా ఎమ్మెల్యేలుగా కొనసాగటానికి పది నెలల సమయం ఉంది. ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లటం ద్వారా సమస్యలు ఉంటాయని భావిస్తున్నారు.
దీంతో ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు మహానాడు ముహూర్తంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన ఇద్దరి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అదే విధంగా గతం లో టీడీపీలో మంత్రిగా పని చేసిన రాజధాని ప్రాంతానికి చెందిన ఒక నేత టీడీపీ వీడిన తరువాత మూడు పార్టీలు మారారు. ఆయన కూడా మహానాడు వేళ తిరిగి టీడీపీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

పొత్తులపైనా స్పష్టత : ఈ మహానాడు ముగింపు ప్రసంగంలో చంద్రబాబు కీలక ప్రకటనలు ఉంటాయని పార్టీ నేతల సమాచారం. సంక్షేమ పథకాలు..సామాజిక న్యాయం అస్త్రాలుగా సీఎం జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. వీటికి కౌంటర్ గా చంద్రబాబు తన కొత్త నిర్ణయాలు ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది.
దీనికి సంబంధించి మహానాడు సమయంలోనే అధికారికంగా క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మరింత ఆలస్యం చేస్తే క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల శ్రేణుల మధ్య సర్దుబాట్లు ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ఉంది. త్వరగా అభ్యర్ధులను ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో, ఈ సారి మహానాడు వేదికగా చంద్రబాబు అమలు చేసే వ్యూహాల పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications