జగన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే.. : చంద్రబాబు
Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం విభజనాంధ్ర ప్రదేశ్‌లో ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ అధినేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. విజయవాడలో ఏర్పాటైన టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఈ ప్రక్రియ పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరి.. ఆయన పేరును ప్రతిపాదించారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అంతకంటే ముందే- జనసేన శాసన సభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శాసన సభ్యులు పవన్‌ను తమ అధినాయకుడిగా ఎన్నుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్.. టీడీఎల్పీ భేటీకి హాజరయ్యారు.

తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ భేటీలో చంద్రబాబు ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఆయన ప్రభుత్వాన్ని, పాలనతీరును తప్పుపట్టారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు అంత దారుణ ఓటమిని అప్పగించారో వివరించారు.అయిదు సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ వంటి వ్యక్తి రాజకీయాలకు ఏ మాత్రం తగడని అన్నారు. పాలనకు పనికిరాడనే ఉద్దేశంతోనే తమను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. ఇదొక కేస్ స్టడీ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
కక్ష తీర్చుకునేలా తాము కూడా పరిపాలన సాగిస్తే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అన్నారు. అలాగని- తప్పు చేసిన వాడిని పూర్తిగా క్షమించి వదిలేస్తే అది అలవాటుగా మారుతుందని, అలాంటివారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్టపరంగా శిక్ష తప్పదని అన్నారు. జగన్ తప్పులపై ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications