ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో టీడీపీ ఇంత అరాచకమా?
Bhumana Karunakar Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్పొరేటర్లు వెళ్తోన్న బస్సుపై రాళ్లతో దాడి చేశారు. వారిని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
బస్సుపై దాడి చేసిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందిన శంకర్ యాదవ్‌గా గుర్తించినట్లు తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. శంకర్ యాదవ్ బస్సు అద్దాలను ధ్వంసం చేశాడని ఆరోపించారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలతోనూ అతను అనుచితంగా వ్యవహరించాడంటూ విమర్శించారు.

తమ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇంతా జరుగుతున్నప్పటికీ- కనీసం టీడీపీ, జనసేన కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదంటూ భగ్గమంటోన్నారు.
ఈ దాడుల పట్ల వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోన్నారని, ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భయాందోళనలు సృష్టిస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందన కార్పొరేటర్లను బెదిరించడం అరాచకమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఇంత నీచంగా వ్యవహరించాలా?, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడానికి, సొంత బలం లేకపోయినా కూటమి నేతలు రెచ్చిపోతున్నారని, తమ పార్టీ కార్పొరేటర్లు, స్థానికులు, తిరుపతి వచ్చే వేలాదిమంద భక్తులను భయభాంత్రులకు గురిచేస్తోన్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడిన ఘటనపై భూమన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని, మెజారిటీ కార్పొరేటర్లు తమ వైపే ఉన్నారని తేల్చి చెప్పారు.
ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, దాడులు చేయడానికీ వెనుకాడట్లేదని భూమన ఆరోపించారు. అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారాయన. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారని, ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం అంటూ నిలదీశారు.












Click it and Unblock the Notifications