అలా చేయకుంటే జగన్ ఎలా అవుతారు..!!
మాజీ సీఎం జగన్ సంబంధించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి న తరువాత అధికారులు అనేక అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. వైసీపీ హయాంలో భారీ గా అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు.. ఖర్చుల పైన ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా జగన్ తన హయాంలో హెలిపాడ్ నిర్మాణం కోసం ఏకంగా రూ 8.6 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం చేసినట్లు టీడీపీ నేతలు చేసిన ఆరోపణ సంచలనంగా మారుతోంది.
హెలిపాడ్ నిర్మాణం వెనుక
వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతి .. అక్రమాల పైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్, లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు వైసీపీ నేతలతో ఇబ్బంది పడిన వారే ఎక్కువగా వస్తున్నారు. గత అయిదేళ్లు కాలంలో తాము పడిన ఇబ్బందుల గురించి వివరిస్తున్నారు. అదే విధంగా భూ సమస్యలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. ఇక.. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యవస్థలతో పాటుగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది. జల్సాలకు...విలాసాలకు ప్రాధాన్యత ఇస్తూ కోట్ల రూపాయాలను ఖర్చు చేసారనేది టీడీపీ నేతల ఆరోపణ.

ప్రజల సొమ్ముతో
జగన్ తాడేపల్లిలో నిర్మించిన ఇంటికి ముఖ్యమంత్రి అయిన తరువాత ఏర్పాటు చేసిన కంచె కోసం రూ 13 కోట్లు ఖర్చు చేసారు. అదే విధంగా ఇంటికి వినియోగించిన ఫర్నీచర్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఖర్చును దుర్వినియోగం చేసారనే విమర్శలు వినిపించాయి. అధికారం కోల్పోయిన తరువాత ఫర్నీచర్ వినియోగం పైన జీఏడీ లేఖ సైతం రాసింది. అదే విధంగా.. జగన్ భద్రత కోసం చేసిన ఖర్చు పైనా రాజకీయంగా విమర్శలు వచ్చాయి. ఇక.. అధికారంలోకి వస్తూనే ప్రజావేదిక కూల్చటంతో పాటుగా రాజధానిలో నిర్మాణాలు నిలిపివేయటం.. మూడు రాజధానుల నినాదంతో కాల యాపనతో ఏపీకి అన్ని రకాలుగా నష్టం జరిగింది. దీంతో, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పెరిగిన ఖర్చు భారంగా మారుతోంది.
సొంత నిర్ణయాలే
ఇక, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ హెలిపాడ్ నిర్మాణం పైన ఆరోపణలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేసింది. అందులో జగన్ హెలిపాడ్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు గురించి వివరించింది. హెలిపాడ్ నిర్మాణానికి రూ 20 లక్షలు కూడా ఖర్చు కాదని, కానీ .. జగన్ తన హయాంలోహెలిప్యాడ్ నిర్మాణం కోసం ఏకంగా రూ.8.60 కోట్ల కేటాయించారని పేర్కొంది. ఈ తరహాలో ప్రజాధనం దుర్వినియోగం చేసారని.. ఇలాంటి ఖర్చుల ద్వారా ఏ స్థాయిలో జల్సాలు చేసారో అర్దం అవుతూందని విమర్శించింది. ఎవరూ ఈ స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం చేసి ఉండరని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజాధనం దుర్వినియోగం
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీతంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకునేవారు. జగన్ నిర్ణయాన్ని పలువురు అభినందించారు. ఇక అధికారంలో ఉన్న సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. హెలిపాడ్ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా నిధులు వినియోగించటమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. వైసీపీ హయాంలో జరిగిన ప్రజా ధనం దుర్వినియోగం నిర్ణయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాను హెలికాప్టర్ ఎక్కే సమయంలో బయటి వారికి కనిపించకుండా జగన్ ఈ స్థాయిలో ఖర్చు చేసి హెలిపాడ్ నిర్మించి నట్లుగా ఆరోపించిన టీడీపీ ఈ మేరకు జీవో కాపీలను బయట పెట్టింది. ఇప్పుడు ఈ వివాదం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications