మంగళగిరి టు పిఠాపురం, ఆపరేషన్ 36 - అర్ద్రరాత్రి లెక్కలు..!!
ఏపీలో ఎన్నికల్లో అసలు లెక్క మొదలైంది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం జరిగింది. అసలైన పోల్ మేనేజ్ మెంట్ మొదలైంది. చివరి 36 గంటలే కీలకంగా మారింది. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల పై స్పెషల్ ఫోకస్ చేసింది. అటు టీడీపీ కూటమి ఈ సారి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. అటు నగదు రవాణా పై నిఘా పెరిగింది. ఈ సాయంత్రం ప్రచారం ముగిసిన తరువాత చోటు చేసుకొనే పరిణామాలే హోరా హోరీ నియోజకవర్గాల్లో ఫలితం మార్చే అవకాశం ఉంది.
కొత్త వ్యూహాలతో
ఏపీలో ప్రతీ నియోజకవర్గంలో గెలుపు కోసం పార్టీలు శ్రమిస్తున్నాయి. మేనిఫెస్టోలు, ప్రచారం హోరా హోరీగా చేసారు. ఈ సాయంత్రం ప్రచారం తరువాత అభ్యర్దులను మద్దతుగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వారంతా వెళ్లి పోవాలి. స్థానిక నేతల పాత్ర కీలకంగా మారుతోంది. ఈ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభం అయి..పూర్తయ్యే వరకూ గెలుపులో కీలకంగా మారనుంది. దీంతో.. పోల్ మేనేజ్ మెంట్ పైన పార్టీల అధినేతలు అభ్యర్దులు..కేడర్ ను అప్రమత్తం చేసాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో అభ్యర్దులు కార్యచరణ వేగవంతం చేసారు.

ఎవరి లెక్కలు వారివే
కొన్ని నియోజకవర్గాల్లో పంపకాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అభ్యర్దులు ఒక్కటవుతున్నారు. ఒకే అంకె అనుకొని ముందుకు వెళ్తున్నారు. టీడీపీ నాయకత్వం వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల పైన ప్రతీ నిమిషం పరిస్థితుల పైన ఆరా తీస్తోంది. ప్రత్యర్ధి వ్యూహాలకు ధీటుగా మార్గదర్శకం చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ల టీం పని చేస్తోంది. అటు వైసీపీ లోనూ ముఖ్య నేతలు గ్రూపులుగా జిల్లాలను పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్దులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాల కోసం అందుబాటులో ఉంటున్నారు. కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ స్పెషల్ టీంలు గురి పెట్టాయి. చివరి నిమిషం రాజకీయం మొదలు పెట్టాయి.

ఆపరేషన్ షురూ
పవన్ కల్యాన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఈ సాయంత్రం నుంచి ఆపరేషన్ ప్రారంభం కానుంది. పవన్ కోసం తరలి వచ్చిన వెండి తెర, బుల్లి తెర నటులు పిఠాపురం సాయంత్రానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది. స్థానిక నేతలు, వైసీపీ కేడర్ పోల్ మేనేజ్ మెంట్ ఈ నియోజకవర్గంలో కీలకం కానుంది. అదే విధంగా మంగళగిరిలోనూ వైసీపీ ఆపరేషన్ ప్రారంభించింది. టీడీపీ నాయకత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వైసీపీ గట్టి పోటీ ఇస్తున్న నియోజకవర్గాల్లో సీనియర్లు పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఈ సాయంత్రం నుంచి మొదలయ్యే 36 గంటల ఆపరేషన్ ఏపీ ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications