త్రిమూర్తులు టీడీపీకి బ్రేకులు వేస్తారా - హిస్టరీ రిపీట్ అయ్యేనా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గోదావరి జిల్లాల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారికే రాష్ట్రంలో అధికారం. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్ల పైన గురి పెట్టాయి. అదే సమయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. జిల్లాలోని మండపేటలో రెండు పార్టీల సీనియర్లు తల పడుతున్నారు. అక్కడి ఎన్నిక ల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.
మారుతున్న లెక్కలు : టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని భావించిన వెంటనే గోదావరి జిల్లాల్లో సమీకరణాలపై జగన్ ఫోకస్ చేసారు. జిల్లాలో ముందుగా అభ్యర్దిని ఖరారు చేసిన నియోజకవర్గం మండపేట. అక్కడ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఇంఛార్జ్ గా నియమించారు. టీడీపీ మండపేటలో వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈ సారి బ్రేకులు వేయటానికి అక్కడ తోట త్రిమూర్తులకు బాధ్యతలు అప్పగించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్ది జోగేశ్వర రావు చేతిలో ఓడిపోయారు. తరువాత ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన కుమారుడుకు రామచంద్రాపురం కేటాయించిన జగన్ త్రిమూర్తుల కు మండపేట నుంచి అభ్యర్దిగా ఖరారు చేసారు.

త్రిమూర్తులు వర్సస్ జోగేశ్వర రావు : తోట త్రిమూర్తులు జిల్లాలో కాపు వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు చంద్రబాబు తిరిగి సీటు ఖరారు చేసారు. టీడీపీ కి కంచుకోటలాగా నిలిచిన ఈ నియోకవర్గంలో జనసేన సహకారంతో మరోసారి గెలుపు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తమతో సంప్రదించకుండా సీటు ప్రకటించటం పైన పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మండపేట నుంచి జనసేన అభ్యర్దిగా వేగుళ్ళ లీలాకృష్ణ సీటు ఆశిస్తున్నారు. కానీ, ఆయనకు సీటు లేకపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల మద్దతు కీలకంగా మారుతోంది. రామచంద్రా పురం లో త్రిమూర్తులు మద్దతు దారులు బోసు కుమారునికి..నియోజకవర్గంలో బోసు మద్దతు దారులు త్రిమూర్తులకు సహకారం అందిస్తున్నారు.

కలిసొచ్చేదెవరికి : 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ది జోగేశ్వర రావుకు 78,029 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్ది బోసుకు 67,429 ఓట్లు పోలయ్యాయి. జనసేన అభ్యర్దిగా పోటీ చేసిన వేగుళ్ల లీలాకృష్ణ కు 35,173 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన అభ్యర్ది లీలాకృష్ణ మద్దతు దారులు టీడీపీకి అండగా నిలిస్తే మరోసారి టీడీపీ ఈ సీటు గెలుపు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో తోట త్రిమూర్తులు సైతం బలమైన అభ్యర్ది కావటంతో పాటుగా కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో..ఇక్కడ టీడీపీ, జనసేన సమన్వయం..ఓట్ల బదిలీ కీలకంగా మారనుంది. సామాజిక వర్గాల సమీకరణాలు గెలుపు, ఓటమలను ప్రభావితం చేయనున్నాయి. దీంతో...మండపేట ఫలితం ఈ సారి రాజకీయంగా ఆసక్తిని పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications